Telangana E-Challan : వాహనదారులకు పోలీస్ వారి గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై భారీ రాయితీ
తెలంగాణలో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు గుడ్ న్యూస్ అందించారు. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ ఆఫర్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ సమాయత్తమవుతోంది. పెండింగ్ చలాన్లను వసూలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గతేడాది పెండింగ్ చలాన్లపై రాయితీ ఇవ్వగా ఫైన్లు కట్టేందుకు వాహనదారుల నుంచి భారీగా ఎగబడ్డారు. గతంలో రాయితీ ఉన్న సమయంలో దాదాపు రూ.300 కోట్ల వరకు పెండింగ్ చలాన్లు వసూలయ్యాయి. మరోసారి డిస్కోంట్ ప్రకటిస్తే పోలీస్ శాఖకు నిధులు సమకూరుతాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే ఉత్వర్తులు వెలువడే అవకాశం ఉంది.
సిగ్నల్ జంపింగ్స్ చేస్తే ఫోటో క్లిక్స్
అయితే,వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే పోలీసులు చలాన్లు విధిస్తుంటారు.ఎక్కడ సిగ్నల్ జంపింగ్ చేసినా ఫొటోలు క్లిక్‌మనిపించి ఆన్‌లైన్‌లో చలాన్లు పంపిస్తారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ-చలాన్లు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ-చలాన్లు వసూలు చేయడం ట్రాఫిక్ పోలీసులకు భారంగా మారుతోంది. ఎక్కడైనా చెకింగ్ నిర్వహించినప్పుడు వెహికిల్ నెంబర్ ఆధారంగా చలాన్లు పెండింగ్‌లో ఉంటే అప్పటికప్పుడే ఎక్కువగా వసూలు అవుతున్నాయి. చాలా మంది వాహనదారులు ఆన్‌లైన్‌లో తమ పెండింగ్ చలాన్లు చూసుకున్నాపెద్దగా క్లియర్ చేసుకోవట్లేదు. ఈ నేపథ్యంలో భారీ రాయితీ ప్రకటిస్తే పెండింగ్ చలాన్లు వసూలు అవుతాయని ట్రాఫిక్ పోలీసులు అంచనాకు వచ్చారు.
రూ.300 కోట్ల వరకు వసూలు
గతేడాది మార్చి 31 నాటికి రాష్ట్రంలో మొత్తం 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉంటే వీటిని వసూలు చేసేందుకు భారీ ఆఫర్ ప్రకటించారు. ద్విచక్ర వాహనాలపై 75 శాతం, మిగిలిన వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. ఫలితంగా వాహనదారుల నుంచి సైతం మంచి స్పందన వేచ్చింది. ఈ క్రమంలోనే పెండింగ్ చలానాలు చెల్లించేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. 45 రోజుల వ్యవధిలోనే సుమారుగా రూ.300 కోట్ల పెండింగ్ చలాన్లు వసూలయ్యాయని పోలీస్ శాఖ వెల్లడించింది. గత కొంత కాలంగా మళ్లీ పెండింగ్ చలానాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీంతో మరోసారి రాయితీ ప్రకటించేందుకు పోలీసులు సిద్ధం అవుతుండటం కొసమెరుపు.