Tirupati Laddoo Row: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన టీటీడీ ఈవో శ్యామలరావు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తిరుమలలో లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు వాడటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై వైసీపీ నేతలు, టీటీడీ మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిలు ఘాటుగా స్పందించారు వారు తిరుమలలో ఎలాంటి అపచారం జరుగలేదని, నెయ్యి, ప్రసాదాలలో ఎలాంటి కల్తీ లేదని స్పష్టం చేశారు. ఈ విషయం మీద టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు స్పందించారు. గతంలో నెయ్యి సరఫరా, నాణ్యతపై ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదని చెప్పారు. అయితే, జంతువుల కొవ్వు కలిసిన నాసిరకం నెయ్యి లడ్డూ, ఇతర ప్రసాదాలకు వినియోగించారని స్పష్టం చేశారు.
టెస్టుకు గుజరాత్ ల్యాబ్‌కు పంపించాం: ఈవో
శ్యామలరావు మాట్లాడుతూ.. "నెయ్యి వంటి పదార్థాలపై కల్తీ జరిగిందో లేదో తెలుసుకోవడానికి నిర్ధిష్టమైన ల్యాబ్ కావాలి. అందుకు రూ.75 లక్షలు ఖర్చు అవుతుంది. మనకు స్వంత ల్యాబ్ ఉంటే ఈ సమస్యలు ఉండేవి కాదని చెప్పారు. లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయి. నెయ్యి క్వాలిటీ బాగాలేదని ఫీడ్ బ్యాక్ వస్తోంది.సరఫరాదారులకు మేము ముందుగానే హెచ్చరికలు ఇచ్చామన్నారు. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్ లిమిటెడ్‌కు మార్చి 12, 2024న టెండర్ పిలిచాము, మే నెలలో దాన్ని ఫైనల్ చేసాము. రూ.320 నుండి రూ.410కి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు.
బయటి ల్యాబ్‌కు శాంపిల్స్ పంపించి పరీక్షలు: ఈవో
ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం ఎస్ వాల్యు టెస్టులు చేయాలి.39 రకాల పరీక్షలు నిర్వహించాలి.ఎస్ వాల్యు టెస్టులో 5రకాల పరీక్షలు ఉంటాయి. అప్రోచ్ మొత్తం క్వాలిటీని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. 98.6నుండి 104వరకు ఫ్యాట్ ఉండాలి,కానీ పరీక్షల్లో 20.3వచ్చినట్లు కనిపిస్తే,అది కల్తీ ఎంత తీవ్రంగా జరిగిందో తెలియజేస్తుంది"అని తెలిపారు. తీవ్రమైన ఆరోపణలు రావడంతో, టీటీడీలో నాణ్యమైన ల్యాబ్ లేకపోవడంతో,తొలిసారిగా బయటి ల్యాబ్‌కు శాంపిల్స్ పంపించి పరీక్షలు నిర్వహించామన్నారు. నాలుగు ట్యాంకర్లలో నెయ్యి నాణ్యత లేదు అని గుర్తించామన్నారు.గుజరాత్‌లోని ఆనంద్ దగ్గర ఎన్డీడీబీ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేపట్టినట్లు తెలిపారు. ఇక్కడ విదేశాలకు పంపించే పదార్థాలను పరిశీలిస్తున్నారు.అయితే, నాణ్యత కొరత ఉన్నట్లు పరీక్షల ఫలితాలు సూచించిన తర్వాత,సరఫరాదారులను హెచ్చరించగా,వారు నెయ్యి నాణ్యతను మెరుగుపరచారని మీడియాకు తెలిపారు.