తిరుమల: టీటీడీ ఎలక్ట్రిక్ బస్సును దొంగిలించిన దుండగులు
తిరుమల తిరుపతి దేవస్థానాని(టీటీడీ)కి చెందిన ఉచిత ఎలక్ట్రిక్ బస్సును దుండగులు దొంగిలించారు. ఈ విషయమై టీటీడి సిబ్బంది ట్రాన్స్ పోర్ట్ అధికారులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దుండగులు ఎత్తుకెళ్లిన ఎలక్ట్రిక్ బస్సు ఎక్కడుందో జీపీఎస్ సాయంతో పోలీసులు గుర్తించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో ఎలక్ట్రిక్ బస్సు ఉందని పోలీసులు తెలియజేసారు. ప్రస్తుతం ఈ బస్సును వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అయితే బస్సు చోరీ గురికావడంపై పోలీసులు ట్రాన్స్ పోర్ట్ జీ.ఎంపై సీరియస్ అయ్యారు. మరికొద్ది రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రత విషయంలో అలసత్వంగా ఉండడంపై సీరియస్ అయ్యారు.
గతంలోనూ చోరీకి గురైన బస్సు
ఎలక్ట్రిక్ బస్సును దుండగులు దొంగిలించారన్న వార్త మీడియాలో వచ్చేవరకు పోలీసులకు సమాచారం అందించకపోవడంతో ట్రాన్స్ పోర్ట్ జీఎంపై పోలీసులు సీరియస్ గా స్పందించారు. గతంలో కూడా కారు మిస్సింగ్ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందించలేదని పోలీసులు తెలియజేస్తున్నారు. టీటీడీ వాహనాల మిస్సింగ్ సంఘటనలు జరగడం ఇది మూడవసారని చెప్పవచ్చు. గతంలో ఎలక్ట్రిక్ బస్సును దొంగిలించిన దుండగులు కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద వదిలేసి వెళ్లిపోయారు. వరుస దొంగతనాల నేపథ్యంలో ట్రాన్స్ పోర్ట్ జీఎంపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.