Bihar: బిహార్‌లో దారుణం..పెళ్లి సందడిలో తుపాకుల మోత.. ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లోని భోజ్‌పుర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకలోకి వచ్చిన ఆరుగురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం రాత్రి ముఫస్సిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చకియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివసించే నరేశ్ యాదవ్ కుమార్తె నేహా వివాహ వేడుక జరుగుతుండగా ఈ దాడి జరిగింది. పద్మినియా గ్రామం నుంచి వరుడి ఊరేగింపు పెళ్లి మండపానికి చేరుకున్న తర్వాత వరమాల కార్యక్రమం పూర్తయింది. అనంతరం అతిథులంతా భోజనాలు ముగించుకుని ఒకచోట చేరి మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఆరుగురు సాయుధ దుండగులు రెండు బైక్‌లపై అక్కడికి వచ్చారు.
వివరాలు
ఓ యువకుడి కుడి తొడలోకి బుల్లెట్
ఎలాంటి హెచ్చరిక లేకుండా ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో పెళ్లి వేడుకలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రాణభయంతో అతిథులు అక్కడి నుంచి పరుగులు తీశారు.
ఈ కాల్పుల్లో రాహుల్ కుమార్ (20), దీపక్ కుమార్ (21) తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే స్థానికులు వారిని ఆరా సదర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మరో యువకుడు సోను కుమార్ (18) కుడి తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సమాచారం అందుకున్న ఎస్‌డీపీఓ-1 సుశీల్ కుమార్ పోలీసు బృందంతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితుడిని కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు.
వివరాలు
నిందితులను పట్టుకునేందుకు సిట్ ఏర్పాటు
అనంతరం కాల్పులు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో పాత కక్షలే ఈ దాడికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.
ఇప్పటికే కొందరు అనుమానితులను గుర్తించినట్లు ఎస్‌డీపీఓ సుశీల్ కుమార్ వెల్లడించారు. వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
పెళ్లి వేడుకలో జరిగిన ఈ కాల్పుల ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.