హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్ ర్యాంపు కూలి 9 మందికి గాయాలు, ఒకరికి సీరియస్
హైదరాబాద్‌లోని సాగర్ రింగ్ రోడ్డు జంక్షన్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద అపశృతి చోటు చేసుకుంది. పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్ ఏర్పాటు చేస్తుండగా అది ఆకస్మికంగా కూలిపోయి ప్రమాదానికి దారి తీసింది. ఘటనలో 9 మంది కార్మికులు గాయపడ్డారని సమాచారం. అందులో ఒకరి పరిస్థితి సిరీయస్ గా ఉంది. హుటాహుటిన బాధితులందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రస్తుతం క్రేన్ సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. క్షతగాత్రులంతా బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా అధికారులు భావిస్తున్నారు.
ఫ్లైఓవర్ ఘటనపై ప్రారంభమైన పోలీసులు విచారణ
మంగళవారంం రాత్రి బైరామల్ గూడా వైపు నుంచి ఫ్లై ఓవర్ పైకి వచ్చే వాహనాల ర్యాంప్ కుప్పకూలిపోయింది. ఆ సమయంలో కూలీలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా, ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఫ్లై ఓవర్ కూలిపోవడానికి గల కారణాలపై నిపుణుల బృందం విచారణ చేపట్టనుంది. ఫ్లై ఓవర్ కూలిపోయిన ప్రాంతాన్ని బల్దియా అధికారులు పరిశీలిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటన అర్ధరాత్రి జరగడంతో భారీ ప్రమాదం తప్పినట్లైంది. వాహనదారులు ఈ ప్లైఓవర్ కింద నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. జనసంచారం ఉన్న సమయంలో ప్రమాదం జరిగి ఉంటే తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని తెలుస్తోంది.