Vishwakarma Yojana: 5శాతం వడ్డీతో రూ.1లక్ష రుణం అందించాలని కేంద్రం నిర్ణయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో 'పీఎం విశ్వకర్మ' పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ పథకానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే మరికొన్ని కీలక నిర్ణయాలను కూడా మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ తీసుకుంది. చేతి వృత్తులను ఆదుకునేందుకు 'పీఎం విశ్వకర్మ' పథకానికి కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం కింద మొదటి విడతగా రూ.13,000 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. హస్తకళాకారులకు రూ.2లక్షల వరకు సబ్సిడీ రుణాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం కింద మొదటి విడతలో 5% వడ్డీతో రూ.1లక్ష రుణం ఇవ్వబడుతుంది. రెండో విడత కింద మరో రూ.1లక్షను 5%వడ్డీ రాయితీతో అందిచనున్నారు.
'పీఎం ఈ-బస్' సేవకు ఆమోదం
కేంద్ర మంత్రివర్గం 'పీఎం ఈ-బస్' సేవకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ఇందుకోసం రూ.57,613 కోట్లు వెచ్చించనున్నట్లు ఠాకూర్ తెలిపారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 10,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. రూ.57,613 కోట్లలో రూ.20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ పథకం 3 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను కవర్ చేస్తుందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో 10,000 ఈ-బస్సులు నడవనున్నాయి. ఈ పథకం కింద బస్సుల నిర్వహణకు 10 సంవత్సరాల పాటు కేంద్రం చేయూతనందిస్తుందని ఠాకూర్ వెల్లడించారు.