
Bihar: బిహార్ మాజీ సీఎం,కేంద్రమంత్రి జితన్‌రామ్ మాంఝీ మనవరాలి హత్య
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి అయిన జితన్ రామ్ మాంఝీ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది ఆయన మనవరాలు సుష్మా దేవి(32)తన భర్త చేతిలోనే హత్యకు గురయ్యారు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని గయా జిల్లాలోని టెటువా గ్రామంలో జరిగింది. భార్యాభర్తల ఘర్షణే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సుష్మా దేవి, తన పిల్లలు, సోదరి పూనమ్ కుమారితో కలిసి ఇంట్లో ఉన్న సమయంలోనే ఈ దుశ్చర్య జరిగింది. పూనమ్ తెలిపిన వివరాల ప్రకారం,మధ్యాహ్నం 12గంటల సమయంలో సుష్మా భర్త రమేష్ పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది.ఈ గొడవ తీవ్రరూపం దాల్చడంతో,రమేష్ నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు.అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
వివరాలు
రమేష్‌కు ఉరిశిక్ష వేయాలని పూనమ్ డిమాండ్
సుష్మా,రమేష్ వివాహం 14 ఏళ్ల క్రితం జరిగింది.సంఘటన జరిగిన సమయంలో పక్క గదిలో ఉన్న పూనమ్, పిల్లలు ఆ దారుణ ఘట్టాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. రక్తపు మడుగులో పడివున్న సుష్మాను చూసిన వారు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కాల్పుల సమయంలో సుష్మా అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. తన సోదరిని హత్య చేసిన రమేష్‌కు ఉరిశిక్ష వేయాలని పూనమ్ డిమాండ్ చేశారు. ఇంట్లో తుపాకీ పేలుడు శబ్దం వినగానే స్థానికులు అక్కడికి చేరుకొని పరిస్థితేంటో తెలుసుకున్నారు. గయా జిల్లా ఎస్ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ,నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా,ఫోరెన్సిక్ బృందం, టెక్నికల్ నిపుణులను ఆధారాలు సేకరించేందుకు ఘటనాస్థలికి పంపించినట్లు చెప్పారు. కేసుపై విచారణ కొనసాగుతున్నదని వెల్లడించారు.