UP CEO: 'దేవుడి దయ.. మైనారిటీని రాముడు చంపలేదు'.. వివాదాస్పద పోస్టుపై యూపీ సీఈవో క్షమాపణలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం మైనారిటీలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పింది. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ శాసన మండలి ఎన్నికల ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న తప్పిదంపై వివరణ ఇచ్చే క్రమంలో వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఓటర్ల జాబితాలో 'రామ్‌హిత్ యాదవ్' అనే పేరును 'రామ్ నే యాదవ్ కో మారా' (రాముడు యాదవ్‌ను కొట్టాడు) అని తప్పుగా నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ బయటపెట్టారు.
వివరాలు
'రాజకీయ అజెండాను అమలు చేస్తున్నారా?'
ఓటర్ల జాబితాలో ఇలాంటి తప్పిదాలు జరగడంపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను సంజయ్ సింగ్ ప్రశ్నించారు.
''రాముడు కేవలం యాదవ్‌నే ఎందుకు కొట్టాడు? సింగ్, పాఠక్, అస్తానా, శర్మ, రాయ్, బిష్ట్‌లను ఎందుకు కొట్టలేదు? మీ కంప్యూటర్‌కు కుల వివక్ష ఉందా? ఏదైనా రాజకీయ పార్టీ అజెండాను అమలు చేస్తున్నారా?'' అని ఆయన ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన యూపీ సీఈవో అధికారిక ఖాతా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసింది.
కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌లకు కుల వివక్ష ఉండదని పేర్కొంటూ జరిగిన తప్పిదాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది.
వివరాలు
'దేవుడి దయ.. మైనారిటీని రాముడు చంపలేదు'
ఇదే తరహాలో ఓటర్ల జాబితాలో మరో తప్పిదం జరిగిన విషయాన్ని యూపీ సీఈవో కార్యాలయం ప్రస్తావించింది.
''ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల ఓటర్ల జాబితాలో 'రామ్ నే శర్మా కో మారా' (రాముడు శర్మను చంపాడు) అనే విచిత్రమైన పేరు నమోదైంది.
కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌లకు కుల వివక్ష ఉండదు. తప్పిదం జరిగిందని అంగీకరిస్తున్నాం. అయితే, ఈ పొరపాటు వల్ల కుల వివక్ష చోటుచేసుకోలేదు'' అని పేర్కొంది.
వివరాలు
'దేవుడి దయ.. మైనారిటీ వ్యక్తిని రాముడు చంపలేదు'
అయితే, ఆ అధికారిక ఖాతా మరో వివాదాస్పద వ్యాఖ్య చేసింది.
''దేవుడి దయ వల్ల రాముడు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని చంపలేదు. అలా జరిగి ఉంటే మమ్మల్ని మతతత్వవాదులని, కులవివక్ష చూపేవారని ఆరోపించేవారు'' అని పోస్టు పెట్టింది.
దీంతో వివాదం మరింత ముదిరింది. యూపీ సీఈవో బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని సంజయ్ సింగ్ విమర్శించారు.
ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్నికల అధికారి కార్యాలయం తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పింది.
వివరాలు
యూపీ సీఈవో ప్రకటన
''మా అధికారిక ఖాతాలో చేసిన వ్యాఖ్యల తీరు, భాష, వ్యంగ్య ధోరణి.. ఆ ఖాతా నుంచి ఆశించే అధికారిక సమాచార ప్రమాణాలకు అనుగుణంగా లేవు. ఈ పోస్టుపై ప్రజల్లో వ్యక్తమైన ఆగ్రహాన్ని గుర్తించాం. వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన, బాధపడిన వారికి హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఇకపై మా అధికారిక ఖాతాలో గౌరవప్రదమైన, అధికారిక భాషనే ఉపయోగిస్తాం'' అని యూపీ సీఈవో కార్యాలయం పేర్కొంది.