
ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ముంబయి పర్యటనకు వెళ్లారు. గురువారం ఆయన ముంబయిలో నిర్వహించే రోడ్ షోలలో పాల్గొంటారు. దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో భాగంగానే యోగి దేశమంతా పర్యటించనున్నారు. జనవరి 5 నుంచి జనవరి 27 వరకు దేశవ్యాప్తంగా తొమ్మిది ముఖ్యమైన నగరాల్లో నిర్వహించే రోడ్ షోల్లో యోగి పాల్గొనున్నారు.
యూపీకి పారిశ్రామిక పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ప్రతి ఏటా.. 'గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్'ను యోగి నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించిన సమ్మిట్‌ను ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రోడ్ షోలు నిర్వహించి.. ప్రధాన పారిశ్రామిక వర్గాల ప్రతినిధులతో సమావేశమై.. ఫిబ్రవరిలో జరిగే సమ్మిట్‍కు వారిని రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు.
యోగి
ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన వారితో సమావేశం
బుధవారం లక్నో నుంచి ముంబయికి చెరుకున్న యోగి ఆదిత్యనాథ్.. సాయంత్రం మహారాష్ట్రలో నివసిస్తున్న ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన వారితో సమావేశం అవుతారు. ఉత్తరప్రదేశ్‌లో ఉపాధి అవకాశాల గురించి వారికి తెలియజేస్తారు.
అలాగే.. ప్రస్తుతం నిర్మిస్తున్న ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ సిటీ సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు సినీ కళాకారులు, నిర్మాతలతో సీఎం యోగి కూడా సమావేశమవుతారు. ఫిబ్రవరిలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గురించి సీఎం యోగి వారికి తెలియజేయనున్నారు.
యోగి ఆదిత్యనాథ్ సీఎం అయినప్పటి నుంచి.. బాలీవుడ్‌ను ముంబయి నుంచి యూపీకి రావాలని కోరుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ సిటీని నిర్మిస్తున్నారు.