LOADING...
India Us trade deal: ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్‌లో ట్విస్ట్..అనూహ్యంగా భారత్‌కు అమెరికా మంత్రి..  
అనూహ్యంగా భారత్‌కు అమెరికా మంత్రి..

India Us trade deal: ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్‌లో ట్విస్ట్..అనూహ్యంగా భారత్‌కు అమెరికా మంత్రి..  

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2026
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం (IND-US Interim Trade Agreement) కుదిరిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇవ్వడంతో, ఇరు దేశాల మధ్య కొనసాగాల్సిన వాణిజ్య చర్చలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయని భారత విదేశాంగశాఖ వర్గాలు ఇటీవల వెల్లడించాయి. ఇదే సమయంలో గురువారం అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ (Howard Lutnick) భారత్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌తో భేటీ అయి, ద్వైపాక్షిక వాణిజ్యం, టారిఫ్‌ల అంశాలపై సమగ్ర చర్చలు జరిపారు.

వివరాలు 

రెండు దేశాల భాగస్వామ్యాన్ని విస్తరించే లక్ష్యంతో సార్థక చర్చలు

ఎటువంటి ముందస్తు అధికారిక ప్రకటన లేకుండా అమెరికా మంత్రి అకస్మాత్తుగా భారత్ పర్యటించడంతో,ట్రేడ్ డీల్‌లో కొన్ని మార్పులు సంభవించే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. భారత్-అమెరికా మధ్య వాణిజ్య, ఆర్థిక బంధాలను మరింత బలపర్చే దిశగా పలు మార్గాలపై చర్చలు జరిగినట్లు అమెరికా వాణిజ్యశాఖ వెల్లడించింది. పీయూష్ గోయల్‌తో జరిగిన ఈ సమావేశాన్ని అత్యంత ఫలప్రదమైనదిగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ (Sergio Gor) అభివర్ణించారు. రెండు దేశాల భాగస్వామ్యాన్ని విస్తరించే లక్ష్యంతో సార్థక చర్చలు జరిగాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

వివరాలు 

భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ లో మార్పులు

'అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం' (IEEPA) ఆధారంగా ప్రపంచ దేశాలపై ట్రంప్ ఏకపక్షంగా టారిఫ్‌లు విధించడాన్ని అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ తీర్పు ప్రభావంతో భారత్-అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ (US-India Trade Deal)లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ట్రంప్ పదవిలోకి వచ్చిన వెంటనే ఇతర దేశాలతో పాటు భారత్‌పైనా 25 శాతం సుంకాలు విధించగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదన్న కారణంతో అదనంగా మరో 25 శాతం టారిఫ్‌లు అమలు చేశారు. దీంతో భారత్‌పై మొత్తం సుంకాల భారం 50 శాతానికి చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దీర్ఘకాలిక వాణిజ్య చర్చలు సాగాయి.

Advertisement

వివరాలు 

ప్రాధాన్యం సంతరించుకున్న అమెరికా వాణిజ్య మంత్రి భారత్‌ పర్యటన

ఇటీవల మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి రూపకల్పన చేయడానికి అవసరమైన ఫ్రేమ్‌వర్క్‌పై రెండు దేశాలు అంగీకరించాయి. దాంతో భారత్‌పై ఉన్న సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించబడ్డాయి. అయితే తాజా సుప్రీంకోర్టు తీర్పుతో ఆ సుంకాలు పూర్తిగా రద్దు అయ్యే పరిస్థితి నెలకొంది. వాటి స్థానంలో ట్రంప్ ప్రకటించిన కొత్త 10 శాతం టారిఫ్‌లు తాత్కాలికంగా అమల్లో కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా వాణిజ్య మంత్రి భారత్‌లో పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement