Loading...
FCRA Bill: విదేశీ నిధుల నియంత్రణపై అమెరికాకు భారత్‌ కౌంటర్
విదేశీ నిధుల నియంత్రణపై అమెరికాకు భారత్‌ కౌంటర్

FCRA Bill: విదేశీ నిధుల నియంత్రణపై అమెరికాకు భారత్‌ కౌంటర్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2026
05:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎఫ్‌సీఆర్‌ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) సవరణ బిల్లుపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది. ఈ అంశం పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారం అని స్పష్టం చేసింది. అంతేకాదు, విదేశాల నుంచి వచ్చే నిధుల ప్రవాహాన్ని నియంత్రించే విధానం అమెరికా సహా అనేక దేశాల్లో అమల్లో ఉందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. భారత చట్టాలకు సంబంధించిన అంశాలపై నిర్ణయాలు దేశ పార్లమెంట్‌ తీసుకుంటుందని తెలిపారు. విదేశీ నిధుల వినియోగాన్ని నియంత్రించే నిబంధనలు కేవలం భారత్‌లోనే కాకుండా అమెరికా సహా పలు దేశాల్లో అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు.

వివరాలు 

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై రైలీ మూర్ అభ్యంతరాలు

అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రైలీ మూర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు స్పందించింది.

ప్రతిపాదిత ఎఫ్‌సీఆర్‌ఏ (సవరణ) బిల్లు-2026లోని కొన్ని నిబంధనలు భారత ప్రభుత్వం చర్చిలు, మతపరమైన సేవా సంస్థల నిర్వహణను స్వాధీనం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయని ఆయన ఆరోపించారు.

ఈ అంశం భవిష్యత్‌లో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు.

వెస్ట్‌ వర్జీనియా నుంచి రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న రైలీ మూర్ మంగళవారం ఎక్స్‌ (X) వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎక్స్‌ (X) వేదికగా రైలీ మూర్ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT

వివరాలు 

ఎఫ్‌సీఆర్‌ఏ ప్రతిపాదన క్రైస్తవులపై ప్రత్యక్ష దాడి

తన పోస్టులో, యేసుక్రీస్తు పునరుత్థానం అనంతరం కొద్ది దశాబ్దాలకే సెయింట్ థామస్ భారతదేశంలోని మలబార్ తీరానికి వచ్చారని, అప్పటి నుంచే దేశంలో క్రైస్తవ మతానికి చరిత్ర ఉందని పేర్కొన్నారు.

అయినప్పటికీ ప్రస్తుతం భారత పార్లమెంట్‌ చర్చిలు, మతపరమైన సేవా సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడానికి అవకాశం కల్పించేలా ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలను సవరించాలని పరిశీలిస్తోందని ఆరోపించారు.

ఈ ప్రతిపాదన క్రైస్తవులపై ప్రత్యక్ష దాడిగా భావిస్తున్నానని రైలీ మూర్ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న రూపంలో ఈ బిల్లు ఆమోదం పొందితే భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో ఇది ప్రధాన ఆందోళన కలిగించే అంశంగా మారుతుందని హెచ్చరించారు.

ADVERTISEMENT

వివరాలు 

విదేశీ విరాళాలు స్వీకరించే విధానంలో మార్పులు చేయాలన్న కేంద్రం

ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం ప్రకారం విదేశాల నుంచి వచ్చే విరాళాలను భారతదేశంలోని సంస్థలు ఎలా స్వీకరించాలి, వాటిని ఎలా వినియోగించాలి అనే అంశాలను నియంత్రిస్తారు.

ఈ చట్టం పరిధిలో సేవా సంస్థలు, విద్యాసంస్థలు, మత సంస్థలు, విదేశీ నిధులు పొందే ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జీఓలు) ఉంటాయి.

ప్రస్తుత చట్టంలో ప్రతిపాదించిన సవరణల ప్రకారం ఎన్‌జీఓలు, ట్రస్టులు, విద్యాసంస్థలు, మత సంస్థలు విదేశీ విరాళాలు స్వీకరించే విధానంలో మార్పులు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది.

వివరాలు 

13,520 సంస్థలు విదేశీ విరాళాల రూపంలో మొత్తం రూ.55,741 కోట్లు

ఈ బిల్లులో అత్యంత వివాదాస్పదంగా మారిన నిబంధనల్లో ఒకటి 'డిజిగ్నేటెడ్ అథారిటీ' ఏర్పాటు.

ఏదైనా సంస్థ ఎఫ్‌సీఆర్‌ఏ నమోదు రద్దు కావడం, స్వచ్ఛందంగా నమోదు వదులుకోవడం లేదా పునరుద్ధరణ జరగకపోవడం వంటి పరిస్థితుల్లో ఆ సంస్థకు వచ్చిన విదేశీ నిధులు, వాటితో సృష్టించిన ఆస్తుల నిర్వహణ బాధ్యతను ఈ ప్రత్యేక అధికార సంస్థ చేపట్టేలా బిల్లులో ప్రతిపాదించారు.

అదేవిధంగా విదేశాల నుంచి వచ్చిన ఆర్థిక విరాళాల నిర్వహణను కూడా ఈ డిజిగ్నేటెడ్ అథారిటీ పర్యవేక్షించే అధికారాన్ని కేంద్రానికి కల్పించే ప్రతిపాదన బిల్లులో ఉంది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2019 నుంచి 2022 మధ్యకాలంలో 13,520 సంస్థలు విదేశీ విరాళాల రూపంలో మొత్తం రూ.55,741 కోట్లు స్వీకరించాయి.

ADVERTISEMENT