US tourist duped in Jaipur: ₹300 ఆభరణాన్ని ₹6 కోట్లకు అమెరికా మహిళకు విక్రయం.. ఫిర్యాదు.. పరారీలో తండ్రీకొడుకులు
జైపూర్‌లోని ఓ నగల దుకాణం నుంచి రూ.6 కోట్ల విలువైన నకిలీ ఆభరణాలను కొనుగోలు చేసి అమెరికాకు చెందిన ఓ మహిళ మోసపోయింది. US ఎంబసీ సహాయంతో, జైపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు, అయితే దుకాణ యజమాని, అతని కుమారుడు పరారీలో ఉన్నారు. అమెరికన్ స్త్రీ పేరు చెరిష్. జైపూర్‌లోని మనక్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోహ్రీ బజార్‌లో ఉన్న దుకాణం నుండి ఆమె ఆభరణాలను కొనుగోలు చేసింది. ఏప్రిల్‌లో, ఆమె ఈ ఆభరణాలను అమెరికాలో జరిగిన ఎగ్జిబిషన్‌లో చూపించింది, అవి నకిలీవని తెలుసుకుంది.
షాపు యజమానులపై చెరిష్ ఫిర్యాదు
జైపూర్‌కు తిరిగి వెళ్లిన తర్వాత, చెరిష్ షాప్ యజమాని రాజేంద్ర సోనీ, అతని కుమారుడు గౌరవ్‌తో దీని గురించి మాట్లాడింది.. కానీ వారు ఆమెకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఆ తర్వాత మే 18న మనక్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో షాపు యజమానులపై చెరిష్ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన షాపు యజమానులు చెరిష్‌పై నకిలీ కేసు పెట్టారు. ఈ మొత్తం విషయంతో కలత చెందిన చెరిష్ అమెరికన్ ఎంబసీ నుండి సహాయం కోరింది.రాయబార కార్యాలయం జోక్యంతో, జైపూర్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ ఆభరణాలను విక్రయించే మోసగాళ్ళని పట్టుకున్నారు.దుకాణం నడుపుతున్న తండ్రీకొడుకులు ప్రస్తుతం పరారీలో ఉన్నప్పటికీ.. ఆభరణాలకు నకిలీ ధ్రువీకరణ పత్రం ఇచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
జైపూర్‌లోని సి-స్కీమ్ ప్రాంతంలో రూ.3 కోట్ల విలువైన ఫ్లాట్
అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) బజరంగ్ సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. నిందితులు రూ.300 విలువైన బంగారు పాలిష్ చేసిన వెండి ఆభరణాలను విదేశీ మహిళకు రూ.6 కోట్లకు విక్రయించినట్లు విచారణలో తేలిందని చెప్పారు. ఆభరణాల ప్రామాణికతను ఆమెకు నకిలీ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. నకిలీ సర్టిఫికెట్ ఇచ్చిన నంద్ కిషోర్‌ను అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న తండ్రీకొడుకుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. నిందితులు ఇటీవల జైపూర్‌లోని సి-స్కీమ్ ప్రాంతంలో రూ.3 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.