Uttarakhand:కేదార్‌నాథ్ యాత్రలో పెను విషాదం.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు భక్తులు మృతి.. మరో ఇద్దరికి గాయాలు
ఉత్తరాఖండ్‌లోని బాబా కేదార్‌నాథ్ యాత్ర నడిచే మార్గంలో ఘోర ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్ జిల్లాలోని చిర్బాసా సమీపంలో ఫుట్‌పాత్‌పై కొండచరియలు విరిగిపడటంతో శిథిలాల కింద కూరుకుపోయి ముగ్గురు యాత్రికులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను రుద్రప్రయాగ ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న జాతీయ విపత్తు నిర్వహణ దళం (NDRF), రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (SDRF) యాత్ర మార్గంలోని శిథిలాలను తొలగించే పనిని ప్రారంభించాయి.
కొండచరియలు విరిగిపడిన శిథిలాల కింద సమాధి అయిన ప్రయాణికులు - రాజ్వార్
చిర్బాస సమీపంలోని కొండపై కొండచరియలు విరిగిపడి యాత్రా మార్గంలో పడిందని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ తెలిపారు. దీంతో పలువురు భక్తులు సమాధి అయ్యారు. ఇప్పటి వరకు 3 మృతదేహాలు లభ్యం కాగా, గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఇతర ప్రయాణికులు కూడా సమాధి అయ్యి ఉండవచ్చని తెలిపారు. NDRF, SDRF బృందాలు శరవేగంగా శిథిలాలను తొలగిస్తున్నాయి. శిథిలాల కారణంగా ప్రయాణం నిలిచిపోయింది.
ప్రమాదంపై ముఖ్యమంత్రి ధామి విచారం వ్యక్తం
ఈ దుర్ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. 'కేదార్‌నాథ్ యాత్ర మార్గం సమీపంలో కొండపై నుండి శిధిలాలు, భారీ రాళ్ల కారణంగా కొంతమంది యాత్రికులు మరణించిన వార్త చాలా బాధాకరమైనది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు సూచనలు చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, మృతుల కుటుంబ సభ్యులకు ఆ నష్టాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను' అని ఆయన ట్విట్టర్‌లో వ్రాశారు.