Uttarakhand: ఉత్తరాఖండ్ సొరంగంలో ఘోర ప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి, ఆరుగురు గల్లంతు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పిపల్‌కోటి ప్రాంతంలోని జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలోకి ఒక్కసారిగా భారీగా నీరు ప్రవేశించింది. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందగా.. మరో ఆరుగురు గల్లంతయ్యారు. 14 మంది గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
వివరాలు
సొరంగంలోకి ఒక్కసారిగా నీరు.. కార్మికుల్లో భయాందోళన
ప్రాథమిక సమాచారం ప్రకారం.. పిపల్‌కోటిలోని తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన ప్రాజెక్టు సొరంగంలో ప్రమాదం జరిగిన సమయంలో పదుల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు.
ఒక్కసారిగా సొరంగంలోకి నీరు రావడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు 22 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులను హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ (హెచ్‌సీసీ) చేపడుతోంది.
ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.
సొరంగంలో చిక్కుకున్న ఇద్దరు కార్మికుల ఆచూకీని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
సొరంగంలో చిక్కుకున్న ఓ కార్మికుడిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
వివరాలు
ఏడుగురు మృతి.. ఆరుగురు గల్లంతు
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ, చమోలీ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.
మిగిలిన మృతులు బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారని అధికారులు వెల్లడించారు.
గాయపడిన వారిలో ఎక్కువ మంది జార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులే ఉన్నట్లు తెలిపారు.
సొరంగంలో నీరు, బురద మట్టం పెరగడంతో సహాయక చర్యలకు కొంతసేపు ఆటంకం ఏర్పడింది.
దీంతో రెస్క్యూ ఆపరేషన్‌ను కొన్ని గంటలపాటు నిలిపివేయాల్సి వచ్చింది. అనంతరం పరిస్థితిని పరిశీలించి సహాయక చర్యలను తిరిగి ప్రారంభించారు.
వివరాలు
సాయంత్రం 6.30 నుంచి 6.45 గంటల మధ్య ప్రమాదం
ఈ ఘటన సాయంత్రం 6.30 నుంచి 6.45 గంటల మధ్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పిపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో సుమారు 1.8 కిలోమీటర్ల లోపల ఉన్న ఓ గుహ నుంచి ఒక్కసారిగా భారీగా నీరు ప్రవేశించినట్లు గాయపడిన కార్మికులు వెల్లడించారు.
దీంతో సొరంగంలో పనిచేస్తున్న వారు అప్రమత్తమై బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.
వివరాలు
రెస్క్యూ ఆపరేషన్‌లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
సొరంగంలో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు మూడు భారీ పంపులను ఏర్పాటు చేశారు. నీటిని తొలగిస్తూ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
ఇటీవల చమోలిలో అడపాదడపా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం కూడా అక్కడ కుండపోత వర్షం పడింది.
పర్వత ప్రాంతం కావడంతో వర్షాల కారణంగా చిన్న నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే సొరంగంలోకి భారీగా నీరు ప్రవేశించి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
వివరాలు
ఘటనపై సీఎం ధామి ఆరా
ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు.
ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. గల్లంతైన కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా సహాయక చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారు.
రెస్క్యూ బృందాలు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని సూచించారు.
ప్రస్తుతం సొరంగంలో చిక్కుకున్న మిగతా కార్మికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.