PRP: ఏపీ రాజకీయాల్లోకి మరో పార్టీ.. పరివర్తన రాజనీతి పార్టీ ఆవిర్భావం
ఈ వార్తాకథనం ఏంటి
వ్యాపారవేత్తగా ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎంపీగా పనిచేసిన విజయసాయిరెడ్డి తాజాగా కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో తన పార్టీ పేరు, జెండా, విధానాలను అధికారికంగా ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం నవంబర్ 11వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాలకు కొత్త పార్టీని ప్రకటిస్తానని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ ప్రకటన అప్పట్లో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. తాజాగా ఆయన విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో పార్టీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తన పార్టీకి పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. పార్టీ జెండాతో పాటు విధానాలను కూడా ఆవిష్కరించారు.
వివరాలు
అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా..
రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రెండు ప్రధాన పార్టీల రాజకీయ ఆధిపత్యానికి, ఆయా కుటుంబాల ప్రాబల్యానికి ముగింపు పలకడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
కేవలం ఒక పార్టీ స్థానంలో మరో పార్టీ అధికారంలోకి రావడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా రాయలసీమ పౌరుషం, ఆత్మగౌరవాన్ని కాపాడటానికి కట్టుబడి ఉంటామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
అదే సమయంలో ప్రాంతీయ ప్రయోజనాలకే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు.