Vijayashanthi : '63 ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ ప్రభుత్వం నడిచింది, 64తో కాంగ్రెస్ సర్కారు నడవదా'
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవాకులు చెవాకులు పేలుతున్న క్రమంలో ఆమె కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్'ను కలిసి బయటకొస్తున్న కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువగా ఉండదని అనడంపై ఆమె మండిపడ్డారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. కేసీఆరే వారితో అలా మాట్లాడిస్తున్నారని రాములమ్మ చెప్పుకొచ్చారు. అధికార స్వార్ధం, అహంకారం, దోపిడి, దుర్మార్గ నియంతృత్వ వ్యవస్థలు ప్రజాస్వామ్య పరిణామాలను సహజంగా వ్యతిరేకిస్తాయన్నారు. 2014లో టీఆర్‌ఎస్‌కు 63 స్థానాలు వచ్చినప్పుడు పూర్తిస్థాయి ప్రభుత్వం నడిచిందని, అయితే ప్రస్తుతం ఆనాటి తెరాస కంటే కాంగ్రెస్'కి ఎక్కువ సీట్లు వచ్చాక సర్కారు ఎందుకు నడవదని ప్రశ్నించారు.