Palle Panduga: నేటి నుంచి పల్లె పండుగ ప్రారంభం.. భూమి పూజలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శలు చేసిన కూటమి నేతలు, ఇప్పుడు తమ హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. 'పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు' పేరిట, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు 13,324 గ్రామాల్లో ఒకేసారి పల్లె పండుగ నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో జరిగే పల్లె పండుగ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
30వేల అభివృద్ధి పనులకు శ్రీకారం
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ. 4,500 కోట్ల వ్యయంతో 30,000 అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. 3,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకా నీటి నిర్వహణకు సంబంధించిన ఇంకుడు గుంతల నిర్మాణం మొదలైన పనులు జరగనున్నాయి. ప్రతి పనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉండేలా వర్క్‌సైట్ బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. సిమెంట్ బస్తాలను స్థానిక మార్కెట్ల నుంచి కొనుగోలు చేయాలని, రోడ్డు నిర్మాణానికి అవసరమైన ఇసుకను క్వారీల నుంచి సేకరించాలని మార్గదర్శకాలు విడుదల చేసింది.
గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
పల్లె పండుగతో గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఉపాధి హామీ నిధులతో 30,000 పనులను చేపట్టి, 8 లక్షల కుటుంబాలకు వందరోజుల ఉపాధి అందించడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.