Page Loader
Telangana: వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌ మృతి 
వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌ మృతి

Telangana: వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌ మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాణోత్ మదన్‌లాల్ (Banoth Madanlal) మృతిచెందారు. నాలుగు రోజుల క్రితం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన ఆయనను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే, చికిత్స పొందుతున్న సమయంలో మంగళవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. గతవారం ఖమ్మంలో ఉన్న తన నివాసంలో ఆయనకు ఆకస్మికంగా వాంతులు, విరేచనాలు రావడంతో కుటుంబ సభ్యులు తొలుత స్థానిక దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచనలతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే పరిస్థితి క్రమంగా విషమించడంతో ఆయన మృతి చెందినట్లు బంధువులు వెల్లడించారు.

వివరాలు 

వైరా నియోజకవర్గానికి బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి

మదన్‌లాల్ మరణంతో వైరా నియోజకవర్గమంతటా విషాద వాతావరణం నెలకొంది. ఆయన మృతి పట్ల పలు పార్టీలకు చెందిన నాయకులు, బీఆర్ఎస్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు సంతాపం తెలియజేశారు. రాజకీయ జీవితంలో మదన్‌లాల్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వైరా నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే, 2018,2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఆపై ఆయన వైరా నియోజకవర్గానికి బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌ మృతి