Visakhapatnam Airport: నేటి అర్ధరాత్రితో విశాఖ ఎయిర్‌పోర్టు సేవలకు బ్రేక్.. రేపటి నుంచి భోగాపురం నుంచి విమానాలు
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం విమానాశ్రయం నుంచి షెడ్యూల్ విమానాల రాకపోకలు నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17న విమాన సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాలను నిలిపివేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ ఇప్పటికే ప్రకటించింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు (ఐఎన్‌ఎస్ డేగ) సివిల్ ఎన్‌క్లేవ్ నుంచి 30 ఏళ్లపాటు షెడ్యూల్డ్ వాణిజ్య విమానాల రాకపోకలు నిలిపివేయనున్నారు. అయితే జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. భారత వాయుసేన, సాయుధ దళాలు, పోలీసు విమానాలతోపాటు ప్రభుత్వ అతిథుల రాకపోకల కోసం వినియోగించే విమానాలు, లీజ్, వీఐపీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి కొనసాగుతాయి.
వివరాలు
తొలి విమానం దేశీయ సర్వీసే..
నాన్‌షెడ్యూల్డ్ వాణిజ్య కార్యకలాపాలకు కూడా అనుమతి ఉంటుంది.
ఇప్పటివరకు విశాఖపట్నం విమానాశ్రయానికి ఉన్న అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ 'వీటీజెడ్ (VTZ)'ను ఆగస్టు 17న అర్ధరాత్రి 00:01 గంటల నుంచి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ చేయనున్నారు.
భోగాపురం నుంచి సింగపూర్‌కు తొలి విమానం ఆగస్టు 16న బయలుదేరుతుందని తొలుత భావించారు. అయితే ఆగస్టు 17 ఉదయం నుంచి విమాన సేవలను ప్రారంభించాలని నిర్ణయించారు.
ఇప్పటికే ఇండిగో సంస్థ భోగాపురం నుంచి హైదరాబాద్, దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, తిరుపతికి తొలి రోజే 31 సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది.
ఇతర విమానయాన సంస్థలు కూడా భోగాపురం విమానాశ్రయం నుంచి తమ సర్వీసుల షెడ్యూళ్లను ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నాయి.
వివరాలు
భోగాపురం నుంచి బయలుదేరే విమానాలు
ఆగస్టు 16 అర్ధరాత్రి నుంచి విశాఖ ఎయిర్‌పోర్టు షెడ్యూల్ సేవలు నిలిచిపోనుండటంతో.. ప్రస్తుతం అక్కడి నుంచి నడుస్తున్న విమాన సర్వీసులు భోగాపురం నుంచి కొనసాగనున్నాయి.
హైదరాబాద్: ఉదయం 8.55, 10.40, మధ్యాహ్నం 1.00, సాయంత్రం 4.25, రాత్రి 7.20, 8.40, 9.20 గంటలకు.
దిల్లీ: ఉదయం 8.20, రాత్రి 10.45 గంటలకు.
బెంగళూరు: మధ్యాహ్నం 2.55, రాత్రి 9.10 గంటలకు.
చెన్నై: మధ్యాహ్నం 12.15, సాయంత్రం 6.35 గంటలకు.
కోల్‌కతా: రాత్రి 7.50 గంటలకు.
ముంబయి: మధ్యాహ్నం 3.05 గంటలకు.
తిరుపతి: మధ్యాహ్నం 1.50 గంటలకు విమానాలు బయలుదేరనున్నాయి.