Visakhapatnam: హోమ్ వర్క్ చేయలేదని చెంపపై కొట్టిన టీచర్.. భయంతో ఆగిన బాలుడి ఊపిరి!
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హోంవర్క్ చేయలేదని టీచర్ మందలించి చెంపపై కొట్టడంతో భయపడిన యూకేజీ విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అదే సమయంలో టీచర్ చేతుల్లోనే గుండె ఆగి ప్రాణాలు విడిచాడు. ఆరేళ్ల చిన్నారి అకస్మాత్తుగా మృతిచెందడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖ నగరంలోని వన్‌టౌన్ కొత్తరోడ్డు ప్రాంతానికి చెందిన తమ్మన కృష్ణప్రసాద్, సాయిప్రియ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె మనస్విని రామ్‌నగర్‌లోని కోటక్ స్కూలులో రెండో తరగతి చదువుతోంది. కుమారుడు ప్రణయ్‌తేజ (6) ఇంటికి సమీపంలోని లిటిల్ గార్డెన్ స్కూలులో యూకేజీ చదువుతున్నాడు.
వివరాలు
బాలుడి షర్టు పట్టుకుని మందలించిన టీచర్..
కృష్ణప్రసాద్ కుటుంబం వారం రోజుల క్రితం తీర్థయాత్రలకు వెళ్లింది. రెండు రోజుల క్రితమే వారు తిరిగి ఇంటికి వచ్చారు.
గురువారం ప్రణయ్‌తేజ ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లాడు. ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో క్లాస్ టీచర్ సుష్మ విద్యార్థుల హోంవర్క్‌ను తనిఖీ చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రణయ్‌తేజ హోంవర్క్ చేయలేదని గుర్తించిన ఆమె.. బాలుడిని తన దగ్గరకు పిలిచినట్లు సమాచారం.
హోంవర్క్ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తూ బాలుడి షర్టు పట్టుకుని మందలించిన టీచర్.. అనంతరం అతడి చెంపపై ఓ దెబ్బ కొట్టారు.
దీంతో ప్రణయ్‌తేజ తీవ్రంగా భయపడిపోయాడు.
వెంటనే ఒక్కసారిగా టీచర్‌పై కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన టీచర్ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్‌కు తెలియజేశారు.
వివరాలు
తీవ్ర ఆవేదనకు గురైన ప్రణయ్‌తేజ తల్లిదండ్రులు, బంధువులు
వెంటనే బాలుడిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అయితే అప్పటికే ప్రణయ్‌తేజ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
అనంతరం చిన్నారి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
ఈ ఘటనతో ప్రణయ్‌తేజ తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
పాఠశాల వద్ద, కేజీహెచ్ మార్చురీ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమ కుమారుడి మృతికి కారణాలపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
వివరాలు
పోలీసుల అదుపులో టీచర్ సుష్మ
తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు టీచర్ సుష్మను అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా.. ఆరేళ్ల బాలుడు పాఠశాలలో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విశాఖ జిల్లా కలెక్టర్ స్పందించారు.
ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. బాలుడి మృతికి అసలు కారణమేంటనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.