వైజాగ్: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును శుక్రవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీతో పాటు ఇతర దిగ్గజ కంపెనీల అధినేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఏపీలో మౌలిక వసతుల కల్పన శరవేగంగా సాగుతోందన్నారు. సీఎం జగన్ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
సులభతర వ్యాపారంలో ప్రథమ స్థానం ఏపీ: బుగ్గన
ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పుష్కలంగా సహజ వనరులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పునరుత్పాదక ఇంధన రంగంలో మంచి పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి పారిశ్రామిక అభివృద్ధిపై ముందుచూపు ఉందని, సులభతర వ్యాపారంలో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.
షెడ్యూల్లో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రారంభోత్సవ కార్యక్రమం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి.