Election Commission: ఓటర్ల జాబితాలో పేరు లేదా? ఫాం 6 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ తర్వాత విడుదల చేసిన ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు ఫాం 6 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. గతంలో ఓటర్లుగా నమోదైన వారు కూడా ఈ విధంగా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఈ నెల 3న అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు ఈసీ లేఖ రాసింది. ఫాం 6 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్లు కాదని, అలాంటి వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని ఈసీ వెల్లడించింది. ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని,గతంలో ఓటరుగా నమోదై ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేసింది.
వివరాలు
సెక్షన్ 31 కింద చర్యలు తీసుకోరాదని అధికారులకు ఆదేశాలు జారీ
ఈ విషయంలో సెక్షన్ 31 కింద చర్యలు తీసుకోరాదని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
అయితే, దరఖాస్తు చేసుకునే వారు మరో పార్లమెంటరీ లేదా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండకూడదని ఈసీ తెలిపింది.
సర్ ప్రక్రియ తర్వాత విడుదలైన ఓటర్ల జాబితాలో పలువురి పేర్లు గల్లంతయ్యాయి.
దీంతో గతంలో ఓటర్లుగా నమోదైన వారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి సందేహిస్తున్నారు.
ఫాం 6 ద్వారా దరఖాస్తు చేసుకుంటే తమ పేర్లను మొదటిసారిగా ఓటర్ల జాబితాలో చేర్చే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.
వివరాలు
ఫాం 6 ద్వారా మళ్లీ దరఖాస్తు
ఈ నేపథ్యంలో ఈసీ స్పష్టత ఇచ్చింది. గతంలో ఓటర్లుగా నమోదై ఉన్నప్పటికీ, ప్రస్తుత జాబితాలో పేరు లేకపోతే ఫాం 6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
అలా దరఖాస్తు చేసుకున్న వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండవని భరోసా ఇచ్చింది.
సర్ ప్రక్రియ తర్వాత ఓటర్ల జాబితాలో భారీగా పేర్లు గల్లంతయ్యాయంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈసీ ఈ ప్రకటన చేసింది.