
Simhachalam: సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో పెనువిషాధం.. గోడకూలి 8 మంది భక్తులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖ జిల్లా సింహాచలంలో జరుగుతున్న చందనోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
నిజరూప దర్శనం కోసం భక్తులు తరలివచ్చిన సమయంలో జరిగిన ప్రమాదంలో గోడ కూలి 8 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు.
ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు.
ఈ ప్రమాదం మంగళవారం అర్ధరాత్రి తర్వాత, సింహాచలంలో కురిసిన భారీ వర్షం అనంతరం చోటుచేసుకుంది.
సింహగిరి బస్టాండ్ నుంచి పైవైపు వెళ్లే దారిలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ల కోసం వేచి ఉన్న క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలిపోయింది.
ఈ ఘటన తెలియగానే ఎన్డీఆర్‌ఎఫ్ బృందం, అధికార యంత్రాంగం సహాయక చర్యలు ప్రారంభించాయి.
వివరాలు
నిజరూపంలో దర్శనం ఇచ్చిన వరాహ లక్ష్మీ నరసింహస్వామి
హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు.
మృతుదేహలను విశాఖ కేజీహెచ్‌కు తరలించగా, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.
సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామివారు భక్తులకు తన నిజరూపంలో దర్శనం ఇచ్చారు.
స్వామివారి ఈ దర్శనం కోసం ముందుగానే వేలాది మంది భక్తులు సింహగిరి కి చేరుకుని వేచి ఉన్నారు.
మంగళవారం వేకువజామున 1 గంటకు సుప్రభాత సేవలతో స్వామివారిని మేల్కొలిపారు.
ఆపై, ఆయన దేహంపై లేపిన చందనాన్ని వెండి బొరిగెలతో ఎంతో నెమ్మదిగా వేరుచేశారు.
అనంతరం స్వామివారి నిజరూపాన్ని భక్తులు దర్శించేలా ఏర్పాట్లు చేశారు.
వివరాలు
ప్రోటోకాల్, అంతరాలయ దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు
స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వైదిక కార్యక్రమాల అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించారు.
వారు స్వామివారికి మొదటి చందనాన్ని సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు.
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రోటోకాల్, అంతరాలయ దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సందర్శనకోసం ఆలయం ప్రత్యేక ఏర్పాట్లతో సందడిగా మారింది.