Mamnoor Airport: మామునూరు.. దేశంలోనే ఒకప్పటి అతిపెద్ద విమానాశ్రయం.. మళ్లీ పునరుద్ధరణకు వేగంగా అడుగులు
ఈ వార్తాకథనం ఏంటి
వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం త్వరలోనే మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ఎయిర్‌పోర్ట్‌కు విశిష్టమైన చరిత్ర ఉంది. 1930లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీనిని నిర్మించారు.సుమారు 1,875 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ విమానాశ్రయంలో 6.6కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో పాటు సిబ్బంది నివాస గృహాలు,పైలట్ల శిక్షణ కేంద్రం,అనేక టెర్మినల్ భవనాలు ఏర్పాటు చేశారు. ఆ కాలంలోనే అత్యాధునిక సౌకర్యాలతో ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. సోలాపూర్ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాల అభివృద్ధికి, సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని కాగిత పరిశ్రమ అవసరాలకు, అలాగే వరంగల్‌లోని ఆజంజాహీ మిల్స్ సేవల కోసం ఈ విమానాశ్రయాన్ని వినియోగించేవారు.
వివరాలు
రన్‌వే విస్తరణ కోసం అదనపు నిధులు
దీంతో ప్రాంతీయ పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషించింది.
1987లో మామునూరు విమానాశ్రయం నుంచి వాయుదూత్ విమాన సర్వీసులు కూడా నడిచాయి. అయితే అనంతర కాలంలో సేవలు నిలిచిపోవడంతో ఈ ఎయిర్‌పోర్ట్ వినియోగం తగ్గిపోయింది.
ఇప్పుడు ఈ చారిత్రక విమానాశ్రయాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
రెండేళ్లలో పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, అవసరమైన భూసేకరణ చేపట్టడంతో పాటు రన్‌వే విస్తరణ కోసం అదనపు నిధులను కూడా కేటాయించింది.
దీంతో మామునూరు విమానాశ్రయం మరోసారి విమాన రాకపోకలకు కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.