Page Loader
Hyderabad: హైదరాబాద్ వాసులకు వాటర్ బోర్డ్ హెచ్చరికలు జారీ.. ఆలా చేస్తే భారీ జరిమానా, కనెక్షన్ కట్! 
హైదరాబాద్ వాసులకు వాటర్ బోర్డ్ హెచ్చరికలు జారీ..

Hyderabad: హైదరాబాద్ వాసులకు వాటర్ బోర్డ్ హెచ్చరికలు జారీ.. ఆలా చేస్తే భారీ జరిమానా, కనెక్షన్ కట్! 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2025
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరా పరిస్థితిపై బుధవారం అధికారులు సమావేశమై సమీక్ష జరిపారు. ఇందులో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. వచ్చే ఏప్రిల్ 15వ తేదీ నుంచి వాటర్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మోటార్ ఫ్రీ ట్యాప్ వాటర్ అనే పేరుతో ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని సూచించారు. అధికారులతో మాట్లాడిన అశోక్ రెడ్డి, పలు నివేదికల ప్రకారం ఇంటి నల్లాలకు మోటార్లు అమర్చడం వల్ల నీటి సరఫరా సమయంలో ప్రెజర్ సమస్యలు ఏర్పడుతున్నట్లు తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్యలు తీవ్రరూపం దాల్చకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టంగా తెలిపారు.

వివరాలు 

హైదరాబాద్ నగరంలో దాదాపు 13.5 లక్షల తాగునీటి కనెక్షన్లు

నల్లాల ద్వారా నీటి సరఫరాలో ప్రెజర్ తక్కువగా ఉండటంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు అశోక్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ప్రజలు తాగునీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం జలమండలి పరిధిలో హైదరాబాద్ నగరంలో దాదాపు 13.5 లక్షల తాగునీటి కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సుమారు 8.5 లక్షల కనెక్షన్లకు ఉచితంగా తాగునీరు అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికి నెలకు సుమారు 20,000 లీటర్ల నీరు సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని నాణ్యతా ప్రమాణాలతో అందించేందుకు ప్రతి 1000 లీటర్లకు రూ.48 వరకు వ్యయం చేస్తోంది జలమండలి.

వివరాలు 

తాగునీటిని పొదుపుగా వాడేందుకు ప్రజల్లో అవగాహన

అయితే, కొందరు ఈ ఉచిత నీటిని వాహనాలు కడగడం, ఇంటి పరిసరాలను శుభ్రం చేయడం, తోటల కోసం వాడటం వంటి పనులకు వినియోగిస్తున్నారు. ఇది ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలకు విరుద్ధమని జలమండలి హెచ్చరిస్తోంది. ఇక, వచ్చే రెండేళ్లపాటు అదనపు నీటి వనరులు అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోవడంతో, ప్రస్తుతం ఉన్న సరఫరాను సద్వినియోగం చేసుకునే దిశగా జలమండలి చర్యలు తీసుకుంటోంది. గోదావరి 2వ, 3వ దశలు పూర్తయ్యేంతవరకూ ప్రస్తుతం ఉన్న నీటినే వినియోగించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. తాగునీటిని పొదుపుగా వాడేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా, అవసరమైతే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా జలమండలి సిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు.