Page Loader
మధ్యాహ్న భోజనంలో పాము.. 30మంది విద్యార్థులకు అస్వస్థత
మధ్యాహ్న భోజనంలో పాము గుర్తింపు

మధ్యాహ్న భోజనంలో పాము.. 30మంది విద్యార్థులకు అస్వస్థత

వ్రాసిన వారు Stalin
Jan 10, 2023
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో ఘోరం జరిగింది. విద్యార్థులు తింటున్న మధ్యాహ్న భోజనంలో పాము కనిపించింది. ఈ క్రమంలో ఆ ఆహారం తిన్న 30 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మయూరేశ్వర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల సిబ్బంది పిల్లల భోజనం కోసం సిద్ధం చేసిన పప్పు కంటైనర్లలోని ఒకదానిలో పాము కనిపించింది. ఇది గుర్తించిన వెంటనే సిబ్బంది పాఠశాల ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కొద్ది సేపటికే ఆ ఆహారం తిన్న పిల్లలకు వాంతులు వచ్చాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం రాంపూర్‌హట్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

పశ్చిమ బెంగాల్

విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన

విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (బీడీఓ) దీపాంజన్ జానా నిర్ధారించారు. ఈ విషయాన్ని ప్రాథమిక పాఠశాలల జిల్లా ఇన్‌స్పెక్టర్‌కు తెలియజేసినట్లు వెల్లడించారు. బుధవారం ఆయన పాఠశాలను సందర్శిస్తారని జానా పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కూడా ఘెరావ్ చేశారు. అతని ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. అయితే ఈ పాఠశాలలో ఇది మొదటి సారి కాదని చెబుతున్నారు తల్లిదండ్రులు. గతంలో కూడా మధ్యాహ్న భోజనంలో బల్లులు, ఎలుకలను చాలాసార్లు గుర్తించినట్లు వారు పేర్కొన్నారు.