LOADING...
TCS Nashik Case: ఐటీ సంస్థలో మహిళలపై ఒత్తిళ్లు.. తొమ్మిది కేసులు నమోదు.. పోలీసుల విచారణలో భయంకర నిజాలు!!
పోలీసుల విచారణలో భయంకర నిజాలు!!

TCS Nashik Case: ఐటీ సంస్థలో మహిళలపై ఒత్తిళ్లు.. తొమ్మిది కేసులు నమోదు.. పోలీసుల విచారణలో భయంకర నిజాలు!!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2026
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాసిక్ నగరంలో ఉన్న ప్రముఖ ఐటీ సంస్థలో వెలుగులోకి వచ్చిన మత ప్రలోభాల ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహిళా ఉద్యోగినులపై లైంగిక వేధింపులు జరిపి,మత మార్పిడికి ప్రేరేపించారనే ఆరోపణలపై పలువురు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మానవ వనరుల విభాగానికి చెందిన అధికారులు, నిర్వాహకులు సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. గోప్యంగా నిర్వహించిన దర్యాప్తులో ఈ ఘటనకు సంబంధించిన అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారం ఫిబ్రవరిలో ఒక రాజకీయ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో ప్రారంభమైంది. సంస్థలో పనిచేస్తున్న ఒక యువతి ఆకస్మికంగా తన ప్రవర్తన మార్చుకుని, రంజాన్ ఉపవాసాలు పాటించడం ప్రారంభించిందని సమాచారం అందడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

వివరాలు 

18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల మధ్య తరగతి యువతులే లక్ష్యం 

ప్రారంభ దశలో పోలీసులు గోప్యంగా చర్యలు చేపట్టి, నలుగురు సిబ్బందిని హౌస్ కీపింగ్ సిబ్బంది వేషధారణలో కార్యాలయంలో నియమించారు. వారు రెండు వారాల పాటు కార్యాలయంలో జరిగే పరిణామాలను నిశితంగా గమనించారు. ఈ గమనికలో కొందరు ఉన్నతస్థాయి సిబ్బంది మహిళా ఉద్యోగినులను లైంగికంగా వేధిస్తున్నట్లు, అలాగే మత మార్పిడికి ప్రలోభపెడుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల మధ్య తరగతి యువతులనే లక్ష్యంగా చేసుకున్నట్లు తేలింది. వారి నెల జీతాలు కూడా పరిమిత స్థాయిలోనే ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతుండగా విదేశానికి చెందిన ఒక మత ప్రచారకుడి పాత్ర కూడా బయటపడింది. వీడియో సంభాషణల ద్వారా బాధితులతో పరిచయం పెంచుకుని,సందేశాల ద్వారా ప్రభావితం చేసినట్లు ఆధారాలు లభించాయి.

వివరాలు 

కేసులో ప్రధాన నిందితుడు ఒక ఉద్యోగి

ఈ కేసులో ప్రధాన నిందితుడు ఒక ఉద్యోగి అని గుర్తించారు. అతడు ఇప్పటికే వివాహితుడైనా, ఆ విషయాన్ని దాచిపెట్టి ఒక యువతిని ప్రేమ పేరుతో మోసగించి, ఆమెను మతపరంగా ప్రభావితం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ యువతిని ఉపవాసాలు పాటించమని, ప్రార్థనలు చేయమని ఒత్తిడి తీసుకువచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తరువాత నిందితుడి కుటుంబ సభ్యుల ద్వారా అతని వివాహం, పిల్లల గురించి సమాచారం బయటపడడంతో విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో మొదటి కేసు నమోదయ్యాక మరికొంత మంది మహిళా ఉద్యోగినులు ధైర్యంగా ముందుకు వచ్చి తమపై జరిగిన వేధింపుల గురించి వెల్లడించారు. ఇప్పటివరకు లైంగిక వేధింపులు,మత మార్పిడి ప్రయత్నాలు,మత భావాలను దెబ్బతీయడం వంటి అంశాలపై మొత్తం తొమ్మిది కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

వివరాలు 

అంతర్గత విచారణ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు 

పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేయగా, మరో మహిళా అధికారి పరారీలో ఉండటంతో ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై సంస్థ ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు సంస్థలో ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఉండదని స్పష్టం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే నిందితులను విధుల నుండి తొలగించడంతో పాటు, అంతర్గత విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ అంశం రాజకీయ రంగంలో కూడా పెద్ద చర్చకు దారి తీసింది. కొంతమంది నేతలు దీనిని తీవ్రమైన అంశంగా పేర్కొంటూ విమర్శలు గుప్పించగా, మరికొందరు బాధితులకు ఉద్యోగాల ఆశ చూపి మోసపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు.

Advertisement