WhatsApp: యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం నోటీసులు.. వాట్సాప్ కీలక వివరణ
ఈ వార్తాకథనం ఏంటి
వాట్సాప్ ప్రవేశపెట్టనున్న 'యూజర్ నేమ్' ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఫీచర్ అమల్లోకి వస్తే భద్రతాపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే విషయంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌ను కోరింది. దీనిపై స్పందించిన సంస్థ కీలక వివరాలను వెల్లడించింది. వాట్సాప్ ప్రతినిధి మాట్లాడుతూ, యూజర్ నేమ్ ఫీచర్‌ను ఇప్పటివరకు అధికారికంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం వినియోగదారులు తమకు నచ్చిన యూజర్ నేమ్‌లను ముందుగానే ఎంపిక చేసుకుని రిజర్వ్ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించామని తెలిపారు.
వివరాలు
ఫోన్ నెంబర్ వాడకం తప్పనిసరి
అలాగే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రముఖుల పేర్లను ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు,ఆయా పేర్లను ప్రత్యేకంగా రిజర్వ్ చేసి ఉంచినట్లు వెల్లడించారు. అలాగే యూజర్ నేమ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా వాట్సాప్ అకౌంట్ సృష్టించడానికి, వినియోగించడానికి మొబైల్ ఫోన్ నెంబర్ తప్పనిసరిగా అవసరమని సంస్థ స్పష్టం చేసింది. ఈ ఫీచర్ కారణంగా వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని, యూజర్ల డేటా భద్రతకు తమ సంస్థ పూర్తిగా కట్టుబడి ఉందని వాట్సాప్ యాజమాన్యం భరోసా ఇచ్చింది.