తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం?
అసెంబ్లీ ఎన్నికలు ఇంకో ఏడాది ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. వ్యూహాత్మకంగా ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించి.. తెలంగాణలో చాలా కాలంగా యాక్టివ్‌గా లేని టీడీపీని చంద్రబాబు తిరిగి చర్చలోకి తీసుకోచ్చారు. టీడీపీ యాక్టివ్ అయితే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. తెలంగాణలో టీడీపీ ఏమాత్రం పుంజుకున్నా.. అది బీఆర్ఎస్‌కే మైనస్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఏపీపై దృష్టిపెట్టాక.. టీడీపీ కేడర్ గణనీయంగా బీఆర్ఎస్ వైపు మళ్లింది. తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయితే.. ఆ కేడర్‌లో కొంతైనా తిరిగి సొంత గూటికి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకోవడానికేనా ?
చంద్రబాబు ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఉనికిని చాటాలనుకోవడానికి కారణాలు లేకపోలేదు. 2019 ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబును ఓడించడానికి జగన్‌కు కేసీఆర్ మద్దతుగా పనిచేసినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనడిచింది. జగన్‌ను గెలిపించేందుకు తలసానిని ఏపీకి పంపి.. అక్కడి యాదవులను గంపగుత్తగా వైసీపీ వైపు మళ్లించేలా, హైదరాబాద్‌లోని ఆంధ్రా వ్యాపారులను జగన్‌కు మద్దతుగా నిలిచేలా కేసీఆర్ చేసినట్లు ప్రచారం జరిగింది. కేసీఆర్ చేసిన పనికి ప్రతీకారంగా తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను గద్దెదించాలని చంద్రబాబు ప్రతినబూనారట. అందుకే తెలంగాణలో బలపడి.. ఇక్కడ అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీకి మద్దతుగా నిలవాలని టీడీపీ అధినేత ఆలోచిస్తున్నారట. తద్వారా బీజేపీకి దగ్గరవ్వాలనుకుంటున్న తన లక్ష్యాన్ని కూడా చేరుకునేలా వ్యూహాత్మకంగా చంద్రబాబు ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది.