కేరళ వరుస పేలుళ్లకు కారకుడైన మార్టిన్ ఎవరు? ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడో తెలుసుకుందాం
కేరళలోని కొచ్చి పట్టణంలో కలమస్సేరిలో యెహోవాసాక్షుల క్రైస్తవ ప్రార్థనా సమావేశంలో జరిగిన వరుస పేలుళ్లతో దేశం ఉలిక్కిపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా హై అలర్ట్ ప్రకటించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, 50మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లకు కేరళకు చెందిన డొమినిక్ మార్టిన్ బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేశాడు. తర్వాత అతను పోలీసులు ఎదుట లొంగిపోయాడు. కేరళ ఏడీజీపీ అజిత్ కుమార్ కూడా మార్టిన్ లొంగుబాటును ధృవీకరించారు. అయితే ఈ వరుస పేలుళ్లకు మార్టిన్ ఎందుకు పాల్పడ్డాడు? అతని కుటుంబ నేపథ్యం ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంత చెప్పినా వినలేదు.. అందుకే పేలుళ్లకు ప్లాన్ చేశా: మార్టిన్
మార్టిన్ గత 16 సంవత్సరాలుగా క్రైస్తవ ప్రార్థన సమావేశాలకు హాజరవుతున్నాడు. అయితే మార్టిన్ కూడా గత కొన్నేళ్లుగా క్రైస్తవ బోధనల పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నాడు. వారి బోధనలు విద్రోహపూరితమైనవిగా మార్టిన్ తాను విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నాడు. వారిది మంచి సంస్థ కాదని, వారి బోధనలు దేశద్రోహాన్ని ప్రోత్సహిస్తున్నాయని తాను గ్రహించినట్లు ఆరోపించాడు. బోధనలను సరిదిద్దాలని తాను చాలాసార్లు క్రైస్తవ సంస్థకు చెప్పినట్లు మారిన్ తన వీడియోలో వెల్లడించాడు. దీంతో ఎంత చెప్పినా వినకపోవడంతో దేశద్రాహాన్ని వ్యాప్తి చేస్తున్ననేపథ్యంలో తనకు వేరే మార్గం లేక.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్టిన్ వివరించాడు.
ప్రజలు మొత్తం నశించి.. వారు మాత్రమే జీవిస్తారట: మార్టిన్
యెహోవాసాక్షుల భావజాలం తప్పు అని మార్టిన్ ఆరోపించాడు. ఇది దేశానికి ప్రమాదకరమని, అందువల్ల దీనిని రాష్ట్రంలో అంతం చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రముఖ వార్తాపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా మార్టిన్ చెప్పిన కొన్ని విషయాలను రాసుకొచ్చింది. యెహోవాసాక్షుల విషపు భావజాన్ని పిల్లల మెదడులోకి ఇంజెక్ట్ చేస్తున్నారని మార్టిన్ పేర్కొన్నాడు. ఇతరుల నుంచి స్వీట్ కూడా తీసుకోకూడదని, జాతీయ గీతం పాడకూడదని, మిలటరీలో చేరవద్దని పిల్లల్లో విషపు బీజాలను క్రైస్తవ ప్రార్థన సమావేశం నిర్వహించిన వారు నాటుతున్నారని తీవ్రమైన ఆరోపణలను చేశాడు. అంతేకాకుండా, ప్రపంచంలోని ప్రజలందరూ నశిస్తారని, వారు మాత్రమే జీవిస్తారని యెహోవాసాక్షులు బోధిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోని మొత్తం ప్రజల నాశనాన్ని కాంక్షించే వ్యక్తులతో మనం ఏమి చేయాలి? మార్టిన్ తన వీడియోలో ప్రశ్నించాడు.
మార్టిన్.. ఓ ఫ్యామిలీ మ్యాన్..
డొమినిక్ మార్టిన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఖాదర్ లేన్ వద్ద డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అతను తన కుటంబంతో నివసిస్తున్నాడు. అప్పటివరకు వివాదాలకు దూరంగా, సౌమ్యంగా కనిపించే మార్టిన్.. ఈ భయంకరమైన పేలుళ్లకు తానే బాధ్యుడినని చెప్పడంతో అతని కుటుంబం, స్నేహితులు, సన్నిహితులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రార్థనా సమావేశంలో పేలుడు పదార్థాలను అమర్చేందుకు వెళ్లిన సమయంలో స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నానని తన భార్యకు మార్టిన్ అబద్ధం చెప్పడం గమనార్హం.
మార్టిన్ ఎప్పుడూ అనుమానాస్పదంగా కనిపించలేదు: ఇంటి యజమాని జలీల్
మార్టిన్ ఇంటి యజమాని జలీల్.. అతను చేసిన పనికి ఆశ్చర్యం వ్యక్తం చేసారు. మార్టిన్ ఎవరినీ పెట్టేవాడు కాదని, అతనికి చాలా మంది స్నేహితులు లేరని, అలాగే శత్రువులు కూడా లేరన్నారు. అతను అద్దెను చెల్లించడం ఎప్పుడూ కూడా ఆలస్యం చేయలేదన్నారు. అలాగే మార్టిన్ ఎప్పుడూ కూడా అనుమానాస్పదంగా కనిపించలేదని జలీల్ పేర్కొన్నారు. మార్టిన్ కేలవం 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. అతను కొన్ని సంవత్సరాల క్రితం తమ్మనంలో స్పోకెన్ ఇంగ్లీష్ ట్యుటోరియల్ నడిపేవాడు. ఆ వ్యాపారం మూతపడడంతో.. ఆ తర్వాత గల్ఫ్‌కు వెళ్లాడు. గల్ఫ్‌లో తన కుమార్తె డెంగ్యూ బారిన పడినప్పుడు మార్టిన్ తిరిగి కేరళకు తిరిగి వచ్చారని, తనకు ఎవరితోనూ ఎలాంటి సమస్యలు లేవని జలీల్ తెలిపారు.