Arun Yogiraj: అయోధ్య శ్రీరాముడి విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ ఎవరు? అతని విజయగాథే ఇదే
జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. అయితే ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించే శ్రీరాముడి విగ్రహాన్ని ఎంపిక చేశారు. మైసూర్‌లోని ఐదు తరాల ప్రసిద్ధ శిల్పుల వంశానికి చెందిన విశిష్ట శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించే శ్రీరాముడి విగ్రహాలను ముగ్గురు ప్రసిద్ధ శిల్పులు చెక్కారు. ఇందులో బెంగళూరుకు చెందిన జీఎల్ భట్, మైసూర్‌కు చెందిన అరుణ్ యోగిరాజ్, రాజస్థాన్‌కు చెందిన సత్యనారాయణ పాండే ఉన్నారు. వీరిలో అరుణ్ యోగిరాజ్ చెక్కిన శ్రీరాముడి విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీనిపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సంతోషం వ్యక్తం చేశారు.
అరుణ్ యోగిరాజ్ ఎవరు?
అరుణ్ యోగిరాజ్ కర్ణాటకలోని మైసూర్ నగరానకి చెందిన ప్రసిద్ధ శిల్పి. ఆయన కుటుంబం ఐదు తరాలుగా శిల్పాలు చెక్కడంలో సిద్ధహస్తులు. మైసూరు రాజు ఆస్థానంలో అరుణ్ యోగిరాజ్ కుటుంబం సుప్రసిద్ధ శిల్పులుగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం దేశంలోని ప్రముఖ శిల్పులలో అరుణ్ ఒకరు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అరుణ్ విగ్రహాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అరుణ్ యోగిరాజ్ శిల్ప కళా ప్రతిభకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఫిదా అయ్యారు. అరుణ్‌పై స్వయంగా ప్రశంసలు కురిపించారు. అరుణ్ యోగిరాజ్ ఎంబీఏ వరకు చదివాడు. కొంత కాలం పాటు ఓ కంపెనీలో కూడా పనిచేశాడు. కానీ, కొద్దిరోజుల్లోనే ఉద్యోగంలో బోర్ కొట్టింది. 2008లో అరుణ్ యోగిరాజ్ ఉద్యోగం వదిలేసి శిల్పాలు తయారు చేయడం ప్రారంభించాడు.
1000కి పైగా శిల్పాల రూపకర్త
అరుణ్ యోగిరాజ్ ఇప్పటివరకు 1 వేలకు పైగా శిల్పాలను రూపొందించారు. కేదార్‌నాథ్‌లోని ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన 30 అడుగుల ఎత్తైన సుభాష్ చంద్రబోస్ విగ్రహ రూపకర్త కూడా అరుణ్ యోగిరాజ్ కావడం గమనార్హం. అంతేకాదు, రెండు అడుగుల ఎత్తైన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని మోదీకి ప్రత్యేక బహుమతిగా అరుణ్ అందజేశారు. ఈ క్రమంలో అరుణ్ ప్రతిభకు ప్రధాని మోదీ మంత్రముగ్ధులయ్యారు. మైసూర్ జిల్లాలోని చుంచన్‌కట్టెలో 21 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం, 15 అడుగుల ఎత్తైన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, మైసూర్‌లోని స్వామి రామకృష్ణ పరమహంస శ్వేత అమృతశిల విగ్రహం ఇలా.. అనేక రకాల విగ్రహాలను అరుణ్ చెక్కారు.
శ్రీరాముడి విగ్రహాన్ని చెక్కడం అంత ఈజీ కాదు: అరుణ్ యోగిరాజ్
శ్రీరాముడి విగ్రహాన్ని చెక్కడం తనకు అంత ఈజీ కాదని అరుణ్ యోగిరాజ్ అన్నారు. దేవుని అవతార విగ్రహం కాబట్టి దివ్యమైన రూపంతో విగ్రహాన్ని తయారు చేయాల్సి వచ్చిందన్నారు. విగ్రహాన్ని చూసేవారికి దైవత్వ భావన కలుగుతుందన్నారు. అరుణ్ యోగిరాజ్ చెక్కిన శ్రీరాముడి విగ్రహం ఎంపిక కావడంపై అతని తల్లి సరస్వతి స్పందించారు. తన కొడుకు అభివృద్ధిని చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. అరుణ్ తనకు రాముడి విగ్రహాన్ని కూడా చూపించలేదని చెప్పారు. అతను విగ్రహాన్ని తయారు చేయడాన్ని తాను చూడాలనుకున్నానని, కానీ చూపించలేదన్నారు. ప్రతిష్టాపన రోజు తీసుకెళ్తానని చెప్పినట్లు సరస్వతి పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ రోజున తాను అయోధ్యకు వెళ్తానని వివరించారు.