SCCL Mines: సింగరేణిలో ఓబీఆర్ పెరుగుతుంటే బొగ్గు ఉత్పత్తి ఎందుకు తగ్గుతోంది?
ఈ వార్తాకథనం ఏంటి
సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో తవ్వుతున్న మట్టి (ఓవర్ బర్డెన్ రిమూవల్-ఓబీఆర్) పరిమాణానికి, వెలికితీస్తున్న బొగ్గు ఉత్పత్తికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోందన్న చర్చ సాగుతోంది. కోల్ ఇండియా గనులతో పోలిస్తే తెలంగాణలో బొగ్గు పొరలు ఎక్కువ లోతులో ఉండటంతో మట్టిని అధికంగా తొలగించాల్సి వస్తుందని సింగరేణి యాజమాన్యం వివరిస్తోంది. అయితే ప్రతి ఏడాది భారీగా ఓబీఆర్ తవ్వుతున్నప్పటికీ బొగ్గు ఉత్పత్తి తగ్గుతుండటంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు పొరలను చేరుకోవాలంటే ముందుగా పైభాగంలోని మట్టి, రాళ్లను తొలగించి బయట గుట్టలుగా నిల్వ చేస్తారు. ఈ ప్రక్రియనే ఓవర్ బర్డెన్ రిమూవల్ (ఓబీఆర్)గా పేర్కొంటారు. ఈ పనుల్లో ఎక్కువ భాగాన్ని సింగరేణి ప్రైవేటు సంస్థలకు టెండర్ల ద్వారా అప్పగిస్తోంది.
వివరాలు
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఓబీఆర్ పరిమాణం 367.90 ఎంసీఎం
ఈ టెండర్ల కేటాయింపుతో పాటు తవ్వుతున్న ఓబీఆర్ పరిమాణంపైనా ఎప్పటికప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇంతకుముందు ప్రతి నెలా ఓబీఆర్ తొలగింపు, బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన గణాంకాలను సింగరేణి తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించేది.
అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆ వివరాలను బహిర్గతం చేయకుండా నిలిపివేయడం ఇప్పుడు మరిన్ని ప్రశ్నలకు దారితీస్తోంది.
ఈ గణాంకాలను గోప్యంగా ఉంచడానికి కారణమేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారిక లెక్కల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 353.43 మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎం) ఓబీఆర్‌ను తొలగించి 64.02మిలియన్ టన్నుల (ఎంటీ) బొగ్గు ఉత్పత్తి చేశారు.
అయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఓబీఆర్ పరిమాణం 367.90 ఎంసీఎంకు పెరిగినా బొగ్గు ఉత్పత్తి మాత్రం 58 మిలియన్ టన్నులకు తగ్గింది.
వివరాలు
చర్చనీయాంశంగా బొగ్గు ఉత్పత్తి
అంటే 2019-20తో పోలిస్తే అదనంగా 14.47 ఎంసీఎం మట్టిని తొలగించినప్పటికీ బొగ్గు ఉత్పత్తి 64.02 మిలియన్ టన్నుల నుంచి 58 మిలియన్ టన్నులకు పడిపోవడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు కేంద్ర బొగ్గుశాఖ విడుదల చేసిన గణాంకాలు కూడా ఈ అంశంపై దృష్టి సారిస్తున్నాయి.
2024-25లో కోల్ ఇండియా గనుల్లో ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి సగటున 2.68 క్యూబిక్ మీటర్ల ఓబీఆర్ తొలగించగా, సింగరేణిలో అదే పరిమాణం 6.09 క్యూబిక్ మీటర్లుగా నమోదైంది.
వివరాలు
బొగ్గులో మట్టి శాతం అధికం
ఈ వ్యత్యాసం కూడా పలు సందేహాలకు కారణమవుతోంది. ఇక గతంలో బొగ్గు ఉత్పత్తి గణాంకాలను వాస్తవానికి మించి చూపిన ప్రభావమే ఇప్పుడు సమస్యగా మారిందని సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం.
మరోవైపు సింగరేణి సరఫరా చేస్తున్న బొగ్గులో మట్టి శాతం అధికంగా ఉందని ఎన్టీపీసీ, తెలంగాణ జెన్‌కో ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.