Sonia Sehrawat: 'కాక్రోచ్' ఇన్‌స్టా స్టోరీతో వివాదంలో సీఆర్పీఎఫ్ కమాండెంట్ సోనియా
ఈ వార్తాకథనం ఏంటి
నీట్ పేపర్ లీక్‌ను నిరసిస్తూ సోమవారం దిల్లీలో జరిగిన ఆందోళనల సందర్భంగా భద్రతా విధులు నిర్వహించిన సీఆర్పీఎఫ్ అధికారిణి సోనియా సెహ్రావత్ పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విధుల నిర్వహణలో జరిగిన ఘర్షణల్లో ఆమె గాయపడినట్లు వార్తలు రావడంతో ఆమె గురించి నెటిజన్లు పెద్దఎత్తున వెతకడం ప్రారంభించారు. అయితే, అదే సమయంలో ఆమె చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ కొత్త వివాదానికి దారితీసింది.
వివరాలు
ఇన్‌స్టా స్టోరీతో రాజకీయ దుమారం
హర్యానాకు చెందిన సోనియా సెహ్రావత్ సీఆర్పీఎఫ్‌లోని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) విభాగంలో అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్నారు.
జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)చేపట్టిన'చలో పార్లమెంట్' ఆందోళన సందర్భంగా భద్రతా బలగాల్లో భాగంగా ఆమె విధులు నిర్వర్తించారు.
ఆందోళనలు ముగిసిన అనంతరం సోనియా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక బొద్దింక చిత్రాన్ని పోస్టు చేసి, 'తమను తామే కాపాడుకోలేని వారు.. దేశాన్ని సరిచేస్తారంట' అనే వ్యాఖ్యను జత చేశారు.
ఈ వ్యాఖ్య సీజేపీని ఉద్దేశించినదిగా భావించడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
పలువురు ప్రతిపక్ష నేతలు అధికారిణి వ్యవహారాన్ని తప్పుబట్టగా, సీజేపీ కూడా దీనిపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
వివాదం ముదరడంతో సోనియా అనంతరం ఆ స్టోరీని తొలగించారు.
వివరాలు
నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు
భద్రతా బలగాల్లో పనిచేసే సిబ్బంది వ్యక్తిగతంగా రాజకీయ అభిప్రాయాలు వ్యక్తం చేయడం, జాతి లేదా వర్గాలపై దూషణలకు పాల్పడడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సేవా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
అలాగే వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల ద్వారా రాజకీయ సందేశాలు పంచుకోవడం కూడా నిషేధితమే.
ఇక సేవా యూనిఫామ్‌లో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఉపయోగించకూడదనే మార్గదర్శకాలు కూడా అమల్లో ఉన్నాయి.
వివరాలు
యూనిఫామ్‌లో ఫొటోలు.. లక్షలాది ఫాలోవర్లు
సోనియా సెహ్రావత్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యక్తిగత ఖాతా ఉంది.
ఆమె ప్రొఫైల్ ఫొటోలో సర్వీస్ యూనిఫామ్‌లో కనిపిస్తుండగా, గతంలోనూ యూనిఫామ్‌లో ఉన్న పలువురు ఫొటోలను తన ఖాతాలో పంచుకున్నట్లు గుర్తించారు.
ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రస్తుతం 6.3 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.
భక్తి, పర్యటనలు, షాపింగ్‌కు సంబంధించిన వ్యక్తిగత పోస్టులతో ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ ఉంది.
అయితే, సేవా నిబంధనలకు విరుద్ధంగా యూనిఫామ్‌లో ఫొటోలు పంచుకోవడం, రాజకీయంగా అర్థమయ్యే వ్యాఖ్యలు చేయడం వల్ల ఇప్పుడు ఆమె వివాదంలో చిక్కుకున్నారు.
వివరాలు
వివరణ కోరే అవకాశం
ఈ పరిణామాల నేపథ్యంలో సోనియా సెహ్రావత్ వ్యవహారాన్ని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
సేవా నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే అంశంపై ఆమె నుంచి వివరణ కోరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
వివరణ అనంతరం శాఖాపరమైన చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.