తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా?
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)తో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అయితే కేసీఆర్ అనుకున్నట్లే ఇతర రాష్ట్రాల్లో పాగా వేస్తారా? జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ భవిష్యత్ 2023లో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ.. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే.. దక్షిణాదిలో తన పార్టీని వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చే ఏకైక నేతగా రికార్డు సృష్టిస్తారు. తద్వారా దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్ నిలదొక్కుకునే అవకాశాలు ఉంటాయి. ఆశించిన ఫలితాలు రాకుంటే. బీఆర్‌ఎస్ విస్తరణ అంత సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రైతులను ఆకర్షించేందుకు తెలంగాణ నమూనా
తెలంగాణలో పాలన, సంక్షేమ పథకాల నమూనాతో జాతీయస్థాయిలో రాణించాలని కేసీఆర్ ఆశపడుతున్నారు. అందులో భాగంగా వ్యూహాత్మకంగా దేశంలో మెజార్టీ సంఖ్యలో ఉన్న రైతులను ఆకర్షించేందుకు 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదాన్ని ఇచ్చారు. తెలంగాణలో రైతులకోసం రైతుబంధు, రైతుబీమ, ఉచిత కరెంట్ లాంటి పథకాలను అమలు చేస్తున్నారు. బీఆర్ఎస్‌ను ఆదరిస్తే.. దేశమంతా ఆ పథకాలను అందిస్తామన్న సంకేతాలను ఇచ్చేందుకే 'అబ్ కి బార్ కిసాన్ సర్కార్' నినాదాన్ని కేసీఆర్ ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో రైతుబంధు, రైతుబీమ, ఉతిత కరెంట్ లాంటి పథకాలు లేవు. రైతులను ఆకర్షించేందుకు కేసీఆర్ ప్రయత్నం ఫలిస్తుందా? 2023లో మూడోసాకి అధికారంలోకి వచ్చి.. జాతీయ స్థాయిలో ప్రభావితం చేస్తారా? అంటే.. ఎన్నికల దాకా ఆగాల్సిందే!