19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా?
దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఈనెల 19న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్.. ప్రధానికి స్వాగతం పలుకుతారా? లేదా? అనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. 2022లో ప్రధాని మోదీ 5సార్లు హైదరాబాద్‌కు వచ్చారు. మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా స్వాగతం పలకడానికి కేసీఆర్ వెళ్లకుండా.. మంత్రి తలసాని వంటి సీనియర్లను పంపారు. తద్వారా బీజేపీ పట్ల వ్యతిరేకతను చెప్పకనే చెప్పినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ, సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్, కాజీపేట రైల్వే కోచ్ వర్క్‌షాప్ పనులతో పాటు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.
పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ
రాష్ట్రంలో గవర్నర్-ప్రభుత్వం మధ్య సరైన సఖ్యత లేదు. ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై బహిరంగంగానే విమర్శలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చాలా రోజులుగా గవర్నర్‌ను అవాయిడ్ చేసిన కేసీఆర్.. ఇటీవల రాష్ట్రపతి ముర్ము ఏర్పాటు చేసిన విందు సందర్భంగా ఆమెను కలవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రధాని వస్తున్నది అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కోసం కాబట్టి.. స్వాగతం పలకడానికి సీఎం కేసీఆర్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఈవెంట్‌కు హాజరు కాకపోతే.. అభివృద్ధి కార్యక్రమాల క్రెడిట్ అంతా.. బీజేపీకే పోతుందనే ఆలోచనతోనైనా ప్రధాని కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని పర్యటన సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను బండి సంజయ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.