Loading...
PM Modi: జర్నలిజంలో సాంకేతిక విప్లవం.. మొబైల్‌ ఫోన్లే కొత్త ఓబీ వ్యాన్లు: మోదీ
జర్నలిజంలో సాంకేతిక విప్లవం.. మొబైల్‌ ఫోన్లే కొత్త ఓబీ వ్యాన్లు: మోదీ

PM Modi: జర్నలిజంలో సాంకేతిక విప్లవం.. మొబైల్‌ ఫోన్లే కొత్త ఓబీ వ్యాన్లు: మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

మీడియాతో తనకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జర్నలిజం రంగంలో అసాధ్యమనేది ఏదీ లేదని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులు, సంక్షోభ సమయాల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే విలేకరులు వార్తల సేకరణ కోసం ఎంతో శ్రమిస్తారని ప్రశంసించారు. దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో జర్నలిస్టుల కోసం దీపావళి మిలన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు.

వివరాలు 

మీడియా కార్యక్రమాల కోసం కుర్చీలు వేసే బాధ్యత

భాజపాలో చేరిన తొలినాళ్లలో మీడియా కార్యక్రమాల కోసం కుర్చీలు వేసే బాధ్యత తనకు ఉండేదని మోదీ గుర్తుచేసుకున్నారు.

''విలేకరులతో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. గత కొన్నేళ్లలో జర్నలిజం రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు మీడియా సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అవుట్‌సైడ్‌ బ్రాడ్‌కాస్ట్‌ (ఓబీ) వ్యాన్లను ఉపయోగించేవారు. ఇప్పుడు ఆ వ్యాన్ల స్థానాన్ని మొబైల్‌ ఫోన్లే భర్తీ చేశాయి. గతంలో వార్తల కోసం పత్రికా ప్రకటనలు (ప్రెస్‌ రిలీజ్‌లు) విడుదల చేసేవారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల విస్తృతితో ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ ద్వారానే ఎన్నో విషయాలు ప్రజలకు చేరుతున్నాయి'' అని వివరించారు.

వివరాలు 

జర్నలిస్టులు మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలి: మోదీ  

ఈ సందర్భంగా దేశాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రధాని వివరించారు.

పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు.

''గతంలో గరీబీ హఠావో వంటి నినాదాలు వినిపించేవి. అయితే, మా ప్రభుత్వం గత 12 ఏళ్లలో 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసింది'' అని మోదీ వెల్లడించారు.

దేశంలో వివిధ రంగాల్లో అసాధారణ విజయాలు సాధించినవారు ఎంతోమంది ఉన్నారని ప్రధాని పేర్కొన్నారు.

అలాంటి వారి విజయగాథలను ప్రపంచానికి పరిచయం చేయాలని జర్నలిస్టులకు సూచించారు.

అదే సమయంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కోరారు.

ADVERTISEMENT