Loading...
Delhi High Court: 'మీరు జెన్‌-జీ కాదు'.. సీజేపీ నేతల వయసుపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు!
'మీరు జెన్‌-జీ కాదు'.. సీజేపీ నేతల వయసుపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు!

Delhi High Court: 'మీరు జెన్‌-జీ కాదు'.. సీజేపీ నేతల వయసుపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2026
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా వయసులపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ''మీరు Gen Z కాదు.. అసలు Gen Z అంటే ఏమిటి?'' అంటూ ప్రశ్నించింది. జంతర్ మంతర్ వద్ద నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో తమ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించడాన్ని సవాలు చేస్తూ వారిద్దరూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది అభిక్ చిమ్నీ వాదనలు వినిపించారు. సౌరవ్ దాస్ వయసు 27 ఏళ్లు కాగా, ఆశుతోష్ రంకా వయసు 32 ఏళ్లని కోర్టుకు వివరించారు.

వివరాలు

పిటిషన్‌ను ఉపసంహరించుకున్న సీజీపీ

దీంతో స్పందించిన న్యాయస్థానం.. ''అయితే మీరు Gen Z కాదు. అసలు Gen Z అంటే ఏమిటి?'' అని వ్యాఖ్యానించినట్లు బార్ అండ్ బెంచ్ నివేదించింది.

1997 తర్వాత జన్మించిన వారిని సాధారణంగా Gen Zగా పరిగణిస్తారని న్యాయవాది వివరించగా.. ''అయితే మీరు Gen Z కాదని కోర్టు మరోసారి వ్యాఖ్యానించింది.

ఈ క్రమంలో సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాల కస్టడీ పొడిగింపును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సీజీపీ ఉపసంహరించుకుంది.

వివరాలు

పిటిషన్‌పై హైకోర్టు ప్రశ్నలు

జస్టిస్ సుబ్రమోనియం ప్రసాద్ ఈ కేసును విచారించారు.

సంబంధిత ఉత్తర్వులను సవాలు చేసేందుకు రివిజన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, పిటిషనర్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని ఆయన ప్రశ్నించారు.

ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) అక్టోబర్ 19న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది.

ఆ ఉత్తర్వుల ప్రకారం.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాల జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 21 వరకు పొడిగించారు.

ADVERTISEMENT

వివరాలు

ఏ సెక్షన్ల కింద నిర్బంధం?

భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్లు 126, 170 కింద ప్రారంభించిన ముందస్తు నిరోధక చర్యల్లో భాగంగా వారిద్దరినీ నిర్బంధించారు.

జంతర్ మంతర్ వద్ద అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.

ఈ కస్టడీ పొడిగింపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు.. రివిజన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం గురించి ప్రశ్నించగా, పిటిషనర్లు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

ADVERTISEMENT