Loading...
Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. అవినాష్‌ రెడ్డికి ఈడీ సమన్లు
వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. అవినాష్‌ రెడ్డికి ఈడీ సమన్లు

Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. అవినాష్‌ రెడ్డికి ఈడీ సమన్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2026
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)సమన్లు జారీ చేసింది. అక్టోబర్‌ 14న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు సమాచారం. 2019లో జరిగిన వివేకా హత్యకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు,మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. వివేకా హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు నిందితులను ఈడీ ప్రశ్నించింది. యాదటి సునీల్‌ యాదవ్‌ను సెప్టెంబర్‌ 25న,ఎర్ర గంగిరెడ్డిని సెప్టెంబర్‌ 29న విచారించినట్లు సమాచారం. షేక్‌ దస్తగిరిని కూడా అధికారులు విచారించారు. దస్తగిరి ఈ కేసులో అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. వీరి వాంగ్మూలాలతో పాటు బ్యాంకు ఖాతాలు,నగదు లావాదేవీలు,నిధుల బదిలీలను ఈడీ పరిశీలిస్తోంది.

వివరాలు 

వివేకానందరెడ్డి హత్య కోసం రూ.40 కోట్ల ఒప్పందం ఆరోపణలపైనా ఈడీ దృష్టి

వివేకానందరెడ్డి హత్య కోసం రూ.40 కోట్ల ఒప్పందం జరిగిందన్న ఆరోపణలపైనా ఈడీ దృష్టి సారించింది.

దస్తగిరికి రూ.1 కోటి అడ్వాన్స్‌గా ఇచ్చినట్లు ఆయన వాంగ్మూలంలో పేర్కొన్న అంశంతో పాటు, రూ.4 కోట్ల నగదు బదిలీ జరిగిందన్న ఆరోపణలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

2019 నుంచి నిందితులకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు,నిధుల కదలికలను విశ్లేషిస్తూ హత్య కేసుతో సంబంధం ఉన్న ఆర్థిక మార్గాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. 2026 ఆగస్టు 21న హైదరాబాద్‌,కడపలో ఈడీ సోదాలు నిర్వహించింది.

ఈడీ అధికారిక ప్రకారం మొత్తం ఏడు ప్రాంతాల్లో ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌ (PMLA) కింద ఈ తనిఖీలు జరిగాయి.

వివరాలు 

కీలక పత్రాలు, డిజిటల్‌ పరికరాల స్వాధీనం

ఈ సందర్భంగా కీలక పత్రాలు, డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి సంబంధించిన ప్రాంగణం నుంచి లెక్కల్లో చూపని రూ.24 లక్షల నగదు, రెండు లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది.

ఈడీ దర్యాప్తు.. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ల ఆధారంగా కొనసాగుతోంది.

హత్యకు సంబంధించిన కుట్ర, ఇతర అంశాలపై సీబీఐ దర్యాప్తు సాగుతుండగా.. దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్‌ కోణాన్ని ఈడీ పరిశీలిస్తోంది.

ఇప్పుడు అక్టోబర్‌ 14న వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఈడీ ఎదుట హాజరైనప్పుడు ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోబోతున్నారు? ఆయన వాంగ్మూలం, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు ఏ దిశగా కొనసాగనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT