Botsa Satyanarayana: వైసీపీ నేత బొత్సకు అస్వస్థత.. హైదరాబాద్‌లో చికిత్స
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహిస్తున్న బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి లోనయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు అత్యవసరంగా హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని సిటీ న్యూరో సెంటర్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం. గురువారం రాత్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ నిర్ధారణ కావడంతో వెంటనే హైదరాబాద్‌కు తీసుకువెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు.
వివరాలు
త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం
పరిస్థితి మెరుగుపడుతున్నందున త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇదివరకు కూడా బొత్స సత్యనారాయణ ఒకసారి అనారోగ్యానికి గురయ్యారు. గత సంవత్సరం జూన్ నెలలో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ నిర్వహించిన 'వెన్నుపోటు దినం' నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంతకంటే ముందుగా 2013లో హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్‌లో కూడా ఆయన చికిత్స పొందారు. మెదడులో రక్తం గడ్డకట్టిన సమస్యతో బాధపడిన ఆయన, అవసరమైన వైద్యం అనంతరం పూర్తిగా కోలుకున్నారు.
వివరాలు
మండలిలో వైసీపీ ప్రతిపక్ష నేతగా బొత్స
ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ, మండలిలో వైసీపీ ప్రతిపక్ష నేతగా బొత్స కీలక పాత్ర పోషిస్తున్నారు. అధికార పార్టీని నేరుగా ప్రశ్నిస్తూ సభలో తన అభిప్రాయాలను బలంగా వ్యక్తపరుస్తున్నారు. అయితే తాజా అనారోగ్య పరిస్థితి కారణంగా కొంతకాలం మండలి సమావేశాలకు ఆయన దూరంగా ఉండే అవకాశముంది.