YSRCP : వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు.. వంశీకృష్ణ, రాంబాబు తర్వాత పార్థసారథి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసంతృప్తి పెరిగిపోతోంది. ఈ మేరకు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల్లో అధిష్టానం మార్పులు చేర్పులకు యోచిస్తోంది. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం జగన్ కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా కొందరికైతే అసలు టిక్కెట్ ఇవ్వట్లేదు. మరికొందరు ఎమ్మెల్యేలను ఈసారి ఎంపీ స్థానానికి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు. ఈ మార్పులు చేర్పులతో అసంతృప్త నేతలు నిరసన గళం విప్పుతున్నారు. ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ ఆక్రోశాన్ని వెల్లగక్కుతున్నారు. ఇటీవలే జనసేనలోకి జంప్ అయిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఇటువంటి ఆరోపణలే చేయగా, తర్వాత అన్నా రాంబాబాబు, ఇప్పుడు ఎమ్మెల్యే పార్థసారథి వంతు వచ్చింది.వీరంతా వైఎస్‌ఆర్‌సీపీ అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
సీఎం జగన్ మాత్రం గుర్తించలేేదు : పార్థసారథి
ఎమ్మెల్యే పార్థసారథి సీఎం జగన్‌పైనే అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను ప్రజలు గుర్తించినా సీఎం జగన్ మాత్రం ఎప్పుడూ గుర్తించలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభ గురువారం రాత్రి నిర్వహించారు. సభకు మంత్రి జోగి రమేష్ సహా ఎమ్మెల్యే పార్థసారథి కూడా హాజరయ్యారు. దురదృష్టవశాత్తు సీఎం జగన్ తనను గుర్తించకపోయినప్పటికీ, పెనమలూరు ప్రజలు తనను గుర్తించారన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారన్నారు. తాను ఎక్కడ ఉన్నా పెనమలూరు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. దీంతో వేదికపై ఉన్నజోగి రమేష్ కోపంతో వేదిక దిగి వెళ్లిపోయారు.