Rajanagaram: త్వరలో రాజానగరంలో జూపార్క్ ఏర్పాటు : ఎంపీ పురంధేశ్వరి
ఈ వార్తాకథనం ఏంటి
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలో జూ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రాజమండ్రి ఎంపీ దగ్గబాటి పురందేశ్వరి వెల్లడించారు. ఈ పార్కు ఏర్పాటుకు సంబంధించిన తన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆమె చెప్పారు. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ఆసక్తిగా చూడగలిగే విధంగా రాజానగరంలో జూపార్క్ ఏర్పాటు చేయడానికి లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. రాజానగరం మండల పరిధిలోని దివాన్‌చెరువు అటవీ భూమిని ఎంపీ పురందేశ్వరి నేతృత్వంలో,ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించిందని, సాధ్యాసాధ్యాల పరిశీలన తర్వాత త్వరలో జూపార్క్ ఏర్పాటుకు కార్యాచరణ రూపకల్పన చేపడతామని పేర్కొన్నారు.
వివరాలు
250 హెక్టార్ల భూమిని జూపార్క్ కోసం వినియోగించుకునే అవకాశం
కేంద్ర బృంద సభ్యులతో కలిసి ప్రాంత భౌగోళిక పరిస్థితులు, అటవీ విస్తీర్ణం, పర్యావరణ అనుకూలతలను సమగ్రంగా పరిశీలించామని ఆమె తెలిపారు. ప్రకృతి పర్యాటక అభివృద్ధికి ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలమని ఎంపీ గుర్తించారు. రాజానగరంలో ప్రస్తుతం సుమారు 311హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ విస్తీర్ణం ఉందని,అందులో 250 హెక్టార్ల భూమిని జూపార్క్ కోసం వినియోగించుకునే అవకాశముందని తెలిపారు. ఈ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూల స్పందనతో, సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం డా.వి.క్లెమెంట్ బెన్ నేతృత్వంలోని బృందాన్ని రాజానగరానికి పంపారని ఎంపీ వివరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తరువాత జూపార్క్ ఏర్పాటుకు ఈ ప్రదేశం అనుకూలమని కేంద్ర బృందం నిర్ధారించిందని ఎంపీ తెలిపారు.
వివరాలు
త్వరలో జూపార్క్ ప్రారంభం అవుతుంది
జంతువులు, పక్షులను బంధించడం కాకుండా, సహజ వాతావరణంలోనే పర్యాటకులు వీక్షించగలిగే విధంగా సరికొత్త విధానంలో జూపార్క్ అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. అన్ని అనుకూలిస్తే, రాజానగరానికి త్వరలో జూపార్క్ ప్రారంభం అవుతుందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీ తెలిపారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, సెంట్రల్ జూ అథారిటీ సభ్య కార్యదర్శి డా. వి. క్లెమెంట్ బెన్, వన్యప్రాణి, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఫారెస్ట్ ప్రొటెక్షన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (సీజేఎ)కు చెందిన అజయ్, డీఎఫ్‌ఓ రాజమహేంద్రవరం బి.ప్రభాకర రావు తదితర అధికారులు పాల్గొన్నారు.