Loading...
Gudannam Recipe: దసరా రోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం.. గుడాన్నం ఇలా చేస్తే రుచి అదుర్స్!
దసరా రోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం.. గుడాన్నం ఇలా చేస్తే రుచి అదుర్స్!

Gudannam Recipe: దసరా రోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం.. గుడాన్నం ఇలా చేస్తే రుచి అదుర్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2026
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారికి సమర్పించే ప్రసాదాల్లో గూడాన్నానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా లలితా దేవికి ఈ నైవేద్యం ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. చూడటానికి, రుచిలో చక్కెర పొంగలిని తలపించినప్పటికీ.. గూడాన్నం తయారీలో పెసరపప్పును ఉపయోగించరు. ఇదే ఈ ప్రసాదం ప్రత్యేకత. తక్కువ సమయంలోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఈ సంప్రదాయ వంటకం రుచిలో అద్భుతంగా ఉంటుంది. మరి గూడాన్నాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

వివరాలు

గూడాన్నం తయారీకి కావలసిన పదార్థాలు

- బియ్యం - 1 కప్పు (పావు కిలో) - నీళ్లు (బియ్యం ఉడికించడానికి) - 4 కప్పులు (1 లీటరు) - బెల్లం - అర కిలో (2.5 కప్పులు) - నీళ్లు (బెల్లం కరిగించడానికి) - 1 కప్పు - నెయ్యి

అర కప్పు - పచ్చి కొబ్బరి - 1 చిప్ప (మెత్తగా తురిమినది లేదా మిక్సీలో గ్రైండ్ చేసినది) - జీడిపప్పు - పావు కప్పు - ఎండు ద్రాక్ష - పావు కప్పు - ఉప్పు - పావు టీ స్పూన్ - యాలకుల పొడి - 1 టీ స్పూన్ - పచ్చ కర్పూరం - చిటికెడు

వివరాలు

గూడాన్నం తయారీ విధానం

1. ముందుగా బియ్యాన్ని మెత్తగా ఉడికించాలి

ముందుగా ఒక కప్పు బియ్యాన్ని రెండు, మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. గూడాన్నం తయారీకి అన్నం చాలా మెత్తగా ఉడకడం ముఖ్యం.

అందుకోసం మందపాటి గిన్నె తీసుకుని అందులో కడిగిన బియ్యాన్ని వేయాలి. అనంతరం నాలుగు కప్పుల నీళ్లు పోయాలి.

అంటే పావు కిలో బియ్యానికి ఒక లీటరు నీళ్లు అవసరమవుతాయి. గిన్నెపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో అన్నం మెత్తగా ఉడికే వరకు ఉంచాలి.

కావాలనుకుంటే బియ్యాన్ని ముందుగా అరగంట పాటు నానబెట్టి కూడా ఉడికించుకోవచ్చు.

ADVERTISEMENT

వివరాలు

2. బెల్లం నీళ్లను సిద్ధం చేసుకోవాలి

బియ్యం ఉడికేలోపు అర కిలో బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. ఈ బెల్లంలో ఒక కప్పు నీళ్లు పోసి స్టవ్‌పై వేడి చేయాలి. బెల్లం పూర్తిగా కరిగి నీళ్లలో కలిసే వరకు వేడి చేస్తే సరిపోతుంది.

దీనికి ప్రత్యేకంగా పాకం పట్టాల్సిన అవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఆ నీళ్లను పక్కన పెట్టుకోవాలి.

అలాగే పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి.

ADVERTISEMENT

వివరాలు

3. అన్నంలో బెల్లం నీళ్లు కలపాలి

అన్నం పూర్తిగా ఉడికి మెత్తగా అయిన తర్వాత గరిటెతో బాగా మెదపాలి. దధ్యోజనం తయారు చేసేటప్పుడు అన్నాన్ని ఎలా మెత్తగా చేస్తామో, అలాగే మెదిపి సిద్ధం చేసుకోవాలి.

ఇప్పుడు మెదిపిన అన్నంలో ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం నీళ్లను వడపోసి పోయాలి.

అనంతరం మీడియం ఫ్లేమ్‌లో ఉంచి అడుగంటకుండా నిరంతరం కలుపుతూ ఉడికించాలి. అన్నం బెల్లం పాకంతో పూర్తిగా కలిసే వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలి.

వివరాలు

4. నెయ్యి కలిపి దగ్గరపడే వరకు ఉడికించాలి

అన్నం, బెల్లం మిశ్రమంలో అర కప్పు నెయ్యిని కొద్దికొద్దిగా కలుపుతూ ఉండాలి. గిన్నె అడుగు నుంచి బాగా కలుపుతూ మిశ్రమం చిక్కబడే వరకు ఉడికించాలి.

గూడాన్నం పూర్తిగా దగ్గరపడి, నెయ్యి కారణంగా మెరుస్తూ కనిపించేంత వరకు సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి.

ఈ దశలో నెయ్యిని అడుగు నుంచి కలుపుతూ ఉండటం వల్ల మిశ్రమం అడుగంటకుండా ఉంటుంది. ఇలా నెమ్మదిగా ఉడికించడం వల్ల గూడాన్నానికి మంచి రుచి వస్తుంది.

వివరాలు

5. జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించాలి

ఇప్పుడు ఒక చిన్న కడాయిని స్టవ్‌పై పెట్టి అందులో పావు కప్పు నెయ్యి వేడి చేయాలి.

నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

ఆ తర్వాత ఎండు ద్రాక్ష వేసి అవి ఉబ్బి పొంగే వరకు వేయించాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేయాలి.

వివరాలు

6. చివరగా మిగిలిన పదార్థాలు కలపాలి

గూడాన్నం బాగా దగ్గరపడిన తర్వాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని వేయాలి.

ఆపై పావు టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం కలపాలి. చివరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షను కూడా వేసి గరిటెతో అడుగు నుంచి పైకి బాగా కలపాలి.

ఇలా అన్ని పదార్థాలు సమంగా కలిసేలా చూసుకుంటే రుచికరమైన గూడాన్నం సిద్ధమవుతుంది. దసరా నవరాత్రుల సమయంలో లలితా దేవికి ఈ గూడాన్నాన్ని నైవేద్యంగా సమర్పించుకోవచ్చు.

బెల్లం తీపి, నెయ్యి సువాసన, కొబ్బరి రుచి, యాలకుల పరిమళంతో ఈ సంప్రదాయ ప్రసాదం ఎంతో రుచిగా ఉంటుంది.

ADVERTISEMENT