ఆహారం: బాదం, వేరుశనగ.. ఆరోగ్యానికి ఏది మంచిది?
ఒక రోజులో 28గ్రాముల గింజలు తింటే అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా గుండె సంబంధ వ్యాధులను దూరం చేస్తాయి. గింజల్లో ముఖ్యమైనవి బాదం, వేరుశనగ. వీటిల్లోని పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడి, నాణ్యమైన జీవితాన్ని అందిస్తాయి. మరి ఈ రెండింటిలో దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. నిజం చెప్పాలంటే బాదం, వేరుశనగ.. రెండింట్లోనూ సూక్ష్మ పోషకాలు సమపాళ్ళలో ఉంటాయి. ఒక ఔన్సు (సుమారు 28గ్రాములు) బాదం పప్పులను వేయించి తింటే 170కేలరీలు శరీరానికి అందుతాయి. అలాగే 6గ్రాముల ప్రోటీన్, 3గ్రాముల ఫైబర్ శరీరానికి చేరుతుంది. వేరుశనగల్లో కూడా 166కేలరీల శక్తి, 7గ్రాముల ప్రోటీన్, 2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాకపోతే వేరుశనగలో విటమిన్ బి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
బాదం, వేరుశనగల్లోని పోషకాలు
బాదంలో "విటమిన్ ఈ" ఎక్కువగా దొరుకుతుంది. మంచి కొవ్వులు బాదం, వేరుశనగల్లో సమపాళ్ళలో ఉంటాయి. ఒక ఔన్సు బాదంలో 15గ్రాముల మంచి కొవ్వు ఉంటే, వేరుశనగలో 14గ్రాములు ఉంటుంది. ఈ మంచికొవ్వు కారణంగా గుండెకు రక్తాన్ని తీసుకెళ్ళే రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడవు. దానివల్ల గుండెకు ఆక్సిజన్ అందుతుంది. గుండె బాగా పనిచేస్తుంది. బాదంలోని "విటమిన్ ఈ" కారణంగా యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. వేరుశనగలోని విటమిన్ బి వల్ల ఫోలేట్, నియాసిన్ శరీరానికి చేరతాయి. మెగ్నీషియం అనే మూలకం రెండింట్లోనూ ఉంటుంది కానీ వేరుశనగతో పోల్చితే బాదంలో మెగ్నీషియం కొంత శాతం ఎక్కువ ఉంటుంది. అందుకే మీ ఆహారంలో గింజలను చేర్చుకోవడం అస్సలు మర్చిపోవద్దు.