Milk: కల్తీ పాలు తాగుతున్నారా? ఇంట్లోనే 4 సింపుల్ టెస్టులతో నిజం బయటపడుతుంది!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం కాలంలో పాలు కూడా ఒక సున్నితమైన విషయంగా మారిపోయాయి. మనం పిల్లలకు గ్లాసు పాలు ఇస్తూ 'అమృతం ఇస్తున్నాం' అనుకుని ఆనందపడుతుంటే... కొందరు స్వార్థపరులు అందులో యూరియా, డిటర్జెంట్, స్టార్చ్ వంటి ప్రమాదకర రసాయనాలు కలిపి స్లో పాయిజన్‌ను అందిస్తున్నారనే వాస్తవం కలవరపెడుతోంది. పాలు తెల్లగా ఉన్నాయంటే సరిపోదు. అవి మీ కిడ్నీలు, ప్రేగులను తీవ్రంగా దెబ్బతీయగలవు. ఈ తెల్లని మాఫియా అసలు ఎలా పనిచేస్తోంది? పాలలో దాగి ఉన్న ఆ నల్లని నిజాలేమిటి? ఇంట్లోనే కల్తీని ఎలా గుర్తించాలి? తెలుసుకుందాం.
Details
కల్తీ వెనుక దాగి ఉన్న ప్రమాదకర రసాయనాలు
కేవలం నీళ్లు కలపడం పాత పద్ధతి. ఇప్పుడు అధిక లాభాల కోసం కొన్ని ముఠాలు వాడుతున్న పదార్థాలు మరింత ప్రమాదకరం. యూరియా - డిటర్జెంట్ పాలకు తెల్లదనం, నురుగు రావడానికి వీటిని కలుపుతున్నారు. ఇవి శరీరంలోకి వెళ్తే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా పేగుల్లో అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ పాలు త్వరగా విరగకుండా ఉండేందుకు దీన్ని ఉపయోగిస్తారు. అయితే ఇది జీర్ణకోశ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీయగలదు స్టార్చ్ - గంజి పొడి పాలు చిక్కగా కనిపించేందుకు గంజి పొడి లేదా స్టార్చ్ కలుపుతున్నారు. ఇవి పెద్ద పేగుపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
Details
సింథటిక్ మిల్క్
ఇది మరింత భయంకరం. అసలు ఆవు, గేదె పాలతో సంబంధం లేకుండా యూరియా, కాస్టిక్ సోడా, శుద్ధి చేసిన నూనె వంటి పదార్థాలు కలిపి కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. చిన్న పరీక్షలు... మీ ప్రాణాలకు రక్షణ బయట దొరికే పాలు కల్తీయో కాదో ఇంట్లోనే కొన్ని సులభ పరీక్షలతో గుర్తించవచ్చు. నీటి కల్తీ పరీక్ష ఒక చుక్క పాలను నునుపైన ఫ్లోర్‌పై వేయండి. స్వచ్ఛమైన పాలు అయితే నెమ్మదిగా కదులుతూ వెనుక తెల్లటి గీత వదులుతాయి. నీళ్లు కలిపితే చుక్క వేగంగా జారిపోతుంది, ఎలాంటి గీత కనిపించదు.
Details
డిటర్జెంట్ టెస్ట్
పాలను గాజు సీసాలో పోసి బాగా కుదిపితే దట్టమైన నురుగు ఏర్పడి ఎక్కువ సేపు అలాగే ఉంటే అందులో సర్ఫ్ లేదా సోప్ ఆయిల్ కలిపినట్లు భావించాలి. పిండి పదార్థాల గుర్తింపు కొద్దిగా పాలలో రెండు చుక్కల అయోడిన్ ద్రావణం వేయండి. పాలు నీలం రంగులోకి మారితే గంజి లేదా స్టార్చ్ కలిపినట్లు అర్థం. యూరియా పరీక్ష పాలలో కొద్దిగా పసుపు వేసి, అందులో ఎర్ర లిట్మస్ పేపర్ ఉంచండి. అది నీలం రంగులోకి మారితే యూరియా కల్తీ ఉన్నట్లు నిర్ధారించుకోవచ్చు. పాలు ఆరోగ్యానికి మూలం కావాలి... కానీ కల్తీ వల్ల అవే నెమ్మదిగా విషంగా మారుతున్నాయి. కాబట్టి తెల్లగా కనిపిస్తున్నాయనే నమ్మకంతో తాగేయకుండా, అప్రమత్తంగా ఉండడం అత్యంత అవసరం.