April 1 : ఆ కష్టాన్ని అనుభవిస్తున్న తేది.. ఒకప్పుడు న్యూ ఇయర్… ఇప్పుడు ఫూల్స్ డే!
ఈ వార్తాకథనం ఏంటి
ఏప్రిల్ మొదటి తేదీని చూస్తే నిజంగా అందరికీ కాస్త జాలేస్తుంది. "బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి" అనే సామెత ఉంది కదా! ఆ మాటకు అర్థం చెప్పడానికి ప్రత్యేకంగా ఒక రోజు ఉంటే, అది ఈ ఏప్రిల్ ఫస్ట్ అనిపిస్తుంది. ఒకప్పుడు ఇది న్యూ ఇయర్ లాగా ఎంతో ప్రాధాన్యంగా ఉండేది. అందరూ దాన్ని ఎంతో గొప్పగా భావించేవారు. కానీ కాలక్రమేణా ఆ గౌరవం జనవరి మొదటి తేదీకి వెళ్లిపోయింది. దాంతో ఏప్రిల్ ఫస్ట్ మెల్లగా తన స్థానాన్ని కోల్పోయి సాధారణ రోజుగా మారిపోయింది.
వివరాలు
ప్రాక్టికల్ జోకర్స్ డే..
పాత రోజుల్లో హీరోలా ఉండి, ఇప్పుడు కొంచెం పక్కకు తప్పుకున్నా, "నాకూ ఒక ప్రత్యేక రోజు ఉంది" అనే భావంతో ఏప్రిల్ ఫస్ట్ తనను తాను ఓదార్చుకుంది. శతాబ్దాల పాటు ప్రజలను నవ్విస్తూ, సరదాగా గడిపేలా చేస్తూ "ఇది ఒక ప్రత్యేకమైన రోజు" అనే గుర్తింపును సంపాదించింది. జనవరి మొదటి తేదీని చూసి కూడా తల ఎత్తుకునే స్థాయిలో నిలిచింది. నిజానికి, పాజిటివ్‌గా ఆలోచించడం అంటే ఏమిటో చూపించే మంచి ఉదాహరణ ఈ రోజు జీవితం అనిపిస్తుంది. సాధారణ రోజుగా అయినా ఉండనివ్వకుండా, దీనిని "ఫూల్స్ డే"గా మార్చేశారు. పాపం ఆ మార్పు ఎంత బాధ కలిగించిందో తెలియదు కానీ, చివరికి ఆ పేరుని కూడా అంగీకరించి "ప్రాక్టికల్ జోకర్స్ డే"గా కొనసాగుతోంది.
వివరాలు
ఆ చరిత్ర ప్రారంభం అయ్యిందిలా..
అలా నాటకం మళ్లీ మారిపోయింది. ఒకప్పుడు గొప్పగా ఉన్న రోజు కాబట్టి, తన పాత ప్రతిష్టను నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ పరిస్థితులు మాత్రం రోజురోజుకీ దిగజారుతున్నాయి. "ఫూల్స్ డే" అంటే ప్రతి ఒక్కరిలోని చిన్నపిల్లాడి సరదా బయటకు వస్తుంది. వేరే వాళ్లను మోసం చేయడానికి విచిత్రమైన కథలు చెబుతారు. అవి నిజమని నమ్మితే, వెంటనే "ఏప్రిల్ ఫూల్!" అని నవ్వేస్తారు. ఆ రోజంతా ఇలాంటి సరదా సంఘటనలే కనిపిస్తాయి. నవ్వులు, ఆనందం నిండిపోతాయి. పిల్లలు అయితే ముందురోజే ప్లాన్లు వేసుకుంటారు. అసలు ఈ రోజు ఎలా ప్రారంభమైందంటే.. కొంచెం చరిత్రలోకి వెళ్తే... 1582కి ముందు యూరప్ దేశాల్లో మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేవారు.
వివరాలు
ప్రాముఖ్యతను కోల్పోయిన రోజు..
పాత సంవత్సరం ముగింపు ఏప్రిల్ ఒకటితో, కొత్త సంవత్సరం ప్రారంభం కూడా అదే రోజుతో ఉండేది. కానీ కాలం తన ఆట ఆడింది. 1582లో పోప్ గ్రెగరీ XIII ఒక కొత్త క్యాలెండర్ ప్రవేశపెట్టాడు. దాంతో జనవరి 1నే న్యూ ఇయర్‌గా నిర్ణయించారు. ఆ మార్పుతో ఏప్రిల్ ఫస్ట్ తన ప్రాముఖ్యత కోల్పోయింది. ఇలా క్రమంగా "ఫూల్స్ డే" అనే సరదా రోజు రూపంలో మారిపోయింది. ఒకప్పుడు "నీ వెనకాల పాము ఉంది" లేదా "నీ డ్రెస్ చినిగింది" అంటూ మోసం చేసి, తరువాత "ఏప్రిల్ ఫూల్!" అని నవ్వుకునే అమాయకమైన రోజులు ఉండేవి. ఇప్పుడు అలాంటి సరదాలు కూడా కనిపించడం తగ్గిపోయింది. ఈ రోజూ కూడా సాధారణ రోజుల్లో ఒకటిగా మారిపోతోంది.
వివరాలు
పరిస్థితి మారిపోతుందా? ఫూల్స్ డే అలాగే నిలిచిపోతుందా?
ఇంకా పరిస్థితి మరింత మారింది. ఇంటర్నెట్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫార్మ్స్ రావడంతో, ప్రతిరోజూ ఫూల్స్ డే లాంటి వాతావరణం ఏర్పడింది. కొందరు ప్రాంక్ వీడియోలు చేసి, జనాలను మోసం చేయడమే వృత్తిగా చేసుకుంటున్నారు. ఇంకొందరు ఆకర్షణీయమైన థంబ్‌నెయిల్స్ పెట్టి "షాకింగ్ వీడియో" అంటూ అప్‌లోడ్ చేస్తారు. ప్రతిరోజూ ఇలా మోసపోతున్నప్పుడు, ప్రత్యేకంగా ఫూల్స్ డే అవసరం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకప్పుడు "చిత్రలహరి", "మీరు కోరిన పాటలు" వంటి కార్యక్రమాలు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు ఏప్రిల్ ఫూల్స్ డే కూడా గత స్మృతులలో కలిసిపోతుందేమో అనిపిస్తోంది.