Foods: వారెవ్వా..నోరూరించే ఇడ్లీలు.. పిండి లేకుండానే సొరకాయతో చేసుకోండిలా
ఈ వార్తాకథనం ఏంటి
సొరకాయతో సాధారణంగా పప్పు, కూరలు, పచ్చళ్లు వంటివి తయారు చేస్తారు. కానీ అదే సొరకాయతో ఇడ్లీలు కూడా చేయవచ్చని చాలామందికి తెలియదు. ఇప్పుడు చెప్పబోయే విధానం ప్రకారం ఒకసారి ప్రయత్నిస్తే, ఈ ఇడ్లీలు ఎంతో మృదువుగా, రుచిగా వస్తాయి. ముఖ్యంగా ముందుగా పిండి సిద్ధం చేసుకోవాల్సిన పని లేకుండా, వెంటనే తయారు చేసుకునే వీలుంది. ఆలస్యం చేయకుండా ఈ సొరకాయ ఇడ్లీల తయారీ విధానాన్ని తెలుసుకుందాం.
వివరాలు
అవసరమైన పదార్థాలు ఇవే
సొరకాయ తురుము - 1 కప్పు
బొంబాయి రవ్వ - 1 కప్పు
పెరుగు - ½ కప్పు
కరివేపాకు - కొద్దిగా
క్యారెట్ - 1 (తరిగినది)
నూనె - 2 టేబుల్ స్పూన్లు
మినపప్పు - ½ టీ స్పూన్
ఎండుమిర్చి - 2
ఆవాలు - ½ టీ స్పూన్
ఉప్పు - తగినంత
కొత్తిమీర తురుము - కొద్దిగా
బేకింగ్ సోడా - ½ టీ స్పూన్
వివరాలు
తయారీ విధానం ఇదే
మొదట అవసరమైన పరిమాణంలో సొరకాయను తీసుకుని ముక్కలు చేసి సిద్ధంగా ఉంచాలి.
అలాగే ఎండుమిర్చిని ముక్కలు చేసి, కరివేపాకు, కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టాలి. క్యారెట్‌ను తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు సొరకాయ తురుమును కొద్దికొద్దిగా తీసుకుని బాగా పిండి అందులోని రసాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి.
తురుమును వేరుగా ఉంచాలి. తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడెక్కిన తరువాత ఆవాలు, మినపప్పు వేసి స్వల్పంగా వేయించాలి.
అందులో ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వాసన వచ్చే వరకు వేయించాలి.
బొంబాయి రవ్వను వేసి తక్కువ మంటపై కలుపుతూ వేయించాలి. రవ్వ కొద్దిగా రంగు మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.
వివరాలు
ఇవి కలిపితే రుచి అద్భుతం..
ఇప్పుడు వేయించిన ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి మార్చాలి.
అందులో ముందుగా తీసుకున్న సొరకాయ రసం, పెరుగు వేసి బాగా కలపాలి.
అవసరమైతే కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఇడ్లీ పిండిలా ఉండే స్థితి వచ్చే వరకు కలిపి, ఈ మిశ్రమాన్ని సుమారు 10 నిమిషాలు నాననివ్వాలి.
10 నిమిషాల తరువాత అందులో ఉప్పు, సొరకాయ తురుము, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర తురుము, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.
వివరాలు
ఇడ్లీలోకి పల్లీ చట్నీ ఉంటే అదుర్స్..
ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి. ఇదే సమయంలో ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి, పిండిని వాటిలో పోయాలి.
తర్వాత ఆ ప్లేట్లను ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి సుమారు 15 నిమిషాల పాటు ఆవిరిలో ఉడికించాలి.
ఇడ్లీలు ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి, మరో 5 నిమిషాలు అలాగే ఉంచి, తరువాత బయటకు తీసుకోవాలి.
ఇంతే! సొరకాయతో మృదువైన, వేడివేడి ఇడ్లీలు సిద్ధం.
ఈ ఇడ్లీలు పల్లీ చట్నీ లేదా అల్లం చట్నీతో తింటే మరింత రుచిగా ఉంటాయి.