LOADING...
Bryan Johnson: కృత్రిమ మేధతో వ్యాధిని జయిస్తానంటున్న బయోహ్యాకర్ బ్రయాన్ జాన్సన్
కృత్రిమ మేధతో వ్యాధిని జయిస్తానంటున్న బయోహ్యాకర్ బ్రయాన్ జాన్సన్

Bryan Johnson: కృత్రిమ మేధతో వ్యాధిని జయిస్తానంటున్న బయోహ్యాకర్ బ్రయాన్ జాన్సన్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడం, ఆయుష్షును పెంచడం, మరణాన్ని సైతం జయించాలనే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బయోహ్యాకర్ బ్రయాన్ జాన్సన్ తాజాగా ఆటోఇమ్యూన్ గ్యాస్ట్రిటిస్ (AIG) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఈ వ్యాధిలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున కడుపు లోపలి పొరపైనే దాడి చేస్తుంది. "నాకు ఆటోఇమ్యూన్ వ్యాధి వచ్చింది. నా కడుపే తనను తాను తినేస్తోంది" అంటూ ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 2నుంచి 5శాతం మందికి ఈ సమస్య ఉన్నప్పటికీ, చాలామందిలో ఇది గుర్తించబడకుండా ఉంటుందని తెలిపారు. ఈ వ్యాధి వల్ల పోషకాహార లోపం,రక్తహీనత వంటి సమస్యలు తలెత్తడంతో పాటు,దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని బ్రయాన్ జాన్సన్ చెప్పారు.

వివరాలు 

ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు ఇంకా పరిశోధన దశలోనే..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య చికిత్సలు ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయలేవని, లక్షణాలను నియంత్రించడం మాత్రమే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఆటోఇమ్యూన్ గ్యాస్ట్రిటిస్ ప్రారంభ దశలో కడుపు నొప్పి, ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సాధారణ లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. దీంతో ఈ వ్యాధి చాలా ఆలస్యంగా గుర్తించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కృత్రిమ మేధ (AI) సాయంతో రూపొందించే ప్రత్యేక యాంటీబాడీలను ఉపయోగించి, ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేస్తున్న అసాధారణ కణాలను నిర్మూలించాలని బ్రయాన్ జాన్సన్ యోచిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

వివరాలు 

21 ఏళ్ల వయసులోనే తనకు హైపోథైరాయిడిజం

తన చిన్ననాటి జీవనశైలే ఈ పరిస్థితికి ప్రధాన కారణమై ఉండొచ్చని బ్రయాన్ తెలిపారు. చిన్నప్పటి నుంచి అధిక చక్కెర ఉన్న సీరియల్స్, శీతల పానీయాలు,ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నానని చెప్పారు. ఇరవై ఏళ్ల ప్రారంభంలో కొంతకాలం ఆరోగ్యకరమైన జీవనం గడిపినా,ఆ తర్వాత ముగ్గురు పిల్లలకు తండ్రిగా మారడం,వ్యాపార బాధ్యతలు,ఒత్తిడి పెరగడంతో 18 కిలోల బరువు పెరిగానని వెల్లడించారు. అదే సమయంలో తీవ్రమైన మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక డిప్రెషన్‌కు గురయ్యానని వివరించారు. 21 ఏళ్ల వయసులోనే తనకు హైపోథైరాయిడిజం ఉన్నట్లు వైద్యులు గుర్తించారని, అప్పటి నుంచి హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకుంటున్నట్లు చెప్పారు. శరీరంలో ఇనుము నిల్వలను సూచించే ఫెరిటిన్ స్థాయులు ఎప్పుడూ తక్కువగానే ఉండేవని, అయితే హీమోగ్లోబిన్ మాత్రం సాధారణంగానే ఉండేదని తెలిపారు.

Advertisement

వివరాలు 

ఆటోఇమ్యూన్ గ్యాస్ట్రిటిస్ లక్షణాలు

ఈ ఏడాది ప్రారంభంలో చేసిన కొలొనోస్కోపీ పరీక్షలో ఎలాంటి సమస్యలు కనిపించలేదని చెప్పారు. అనంతరం చేసిన ఎండోస్కోపీ, బయాప్సీ పరీక్షల్లో కడుపులోని మూడు ప్రాంతాల నుంచి సేకరించిన నమూనాల్లో ప్రారంభ దశ ఆటోఇమ్యూన్ గ్యాస్ట్రిటిస్ లక్షణాలు స్పష్టంగా బయటపడ్డాయని వెల్లడించారు. ముఖ్యంగా ఆమ్లాన్ని ఉత్పత్తి చేసే కడుపు పొరలో మాత్రమే ప్రారంభ దశ క్షీణత కనిపించిందని, మిగిలిన భాగాలు ఇంకా ప్రభావితం కాలేదని వైద్యులు గుర్తించారు.

Advertisement

వివరాలు 

2039 నాటికి అమరత్వాన్ని సాధించాలనే లక్ష్యం..

48 ఏళ్ల బ్రయాన్ జాన్సన్ వృద్ధాప్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన 'ప్రాజెక్ట్ బ్లూప్రింట్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2039 నాటికి అమరత్వాన్ని సాధించాలనే లక్ష్యంతో పరిశోధనలు కొనసాగిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఆయన స్థాపించిన ఈ-కామర్స్ సంస్థ బ్రెయిన్‌ట్రీని 2013లో పేపాల్‌కు 800 మిలియన్ అమెరికన్ డాలర్లకు విక్రయించారు. ఆ తర్వాత వచ్చిన సంపదను ఆరోగ్య పరిశోధనలు, దీర్ఘాయుష్షు ప్రయోగాల కోసం వినియోగిస్తున్నారు. తన ప్రాజెక్ట్ ద్వారా శరీర వృద్ధాప్య వేగాన్ని సుమారు 31 సంవత్సరాల మేర తగ్గించగలిగానని కూడా బ్రయాన్ జాన్సన్ గతంలో పేర్కొన్నారు.

Advertisement