Dogs Sniff Cancer? : కుక్కలు క్యాన్సర్‌ను పసిగట్టగలవా? భారత స్టార్టప్ కొత్త ప్రయోగం
ఈ వార్తాకథనం ఏంటి
కుక్కలు క్యాన్సర్‌ను వాసన ద్వారా గుర్తించగలవా? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు భారత్‌కు చెందిన హెల్త్‌టెక్ స్టార్టప్ డాగ్నోసిస్ ప్రయత్నిస్తోంది. శిక్షణ పొందిన కుక్కలు, మనుషుల శ్వాస నమూనాలు, కృత్రిమ మేధస్సు (AI) సాయంతో క్యాన్సర్ సంకేతాలను ముందుగానే గుర్తించే విధానాన్ని సంస్థ పరిశీలిస్తోంది. అయితే ఈ టెక్నాలజీ ఇంకా పరిశోధన, పరీక్షల దశలోనే ఉంది. వైద్యులు చేసే క్యాన్సర్ నిర్ధారణకు ఇది ప్రత్యామ్నాయం కాదు. భవిష్యత్తులో అదనపు స్క్రీనింగ్ సాధనంగా ఉపయోగపడే అవకాశాన్ని మాత్రమే ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. మన శరీరంలో జరిగే జీవక్రియల వల్ల వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (VOCs) అనే రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతాయి.
వివరాలు
కుక్కల వాసన శక్తితో వ్యాధుల గుర్తింపు
ఇవి శ్వాస, చెమట, మూత్రం, ఇతర శరీర ద్రవాల ద్వారా బయటకు వస్తాయి.
వ్యాధులు, ముఖ్యంగా క్యాన్సర్, శరీరంలోని జీవక్రియలను మార్చే అవకాశం ఉంది.
దీంతో బయటకు విడుదలయ్యే రసాయనాల మిశ్రమంలోనూ మార్పులు రావచ్చు.
ఈ మార్పులను కుక్కల అద్భుతమైన వాసన గుర్తించే సామర్థ్యం ద్వారా గుర్తించవచ్చా అన్నదే డాగ్నోసిస్ పరిశోధనలో కీలక అంశం.
పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలు, ఇతర పదార్థాలను గుర్తించేందుకు కుక్కలను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు.
వ్యాధులను గుర్తించడంలోనూ వాటి వాసన శక్తిని ఉపయోగించవచ్చా అనే పరిశోధనలు దశాబ్దాలుగా జరుగుతున్నాయి.
క్యాన్సర్ సహా కొన్ని వ్యాధులను జీవ నమూనాల ద్వారా కుక్కలు గుర్తించగలవా అనే అంశంపై ఇప్పటికే పలు అధ్యయనాలు జరిగాయి.
వివరాలు
కుక్కల వాసన సంకేతాలను వైద్య సమాచారంగా మార్చే టెక్నాలజీ
కుక్క గుర్తించే విషయాన్ని వైద్యులకు ఉపయోగపడే సమాచారంగా ఎలా మార్చాలి? ఇదే అసలు సవాలు.
డాగ్నోసిస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆకాష్ కుల్గోడ్ మాట్లాడుతూ.. కుక్కలు మనుషుల కంటే ఎంతో విస్తృతమైన వాసన ప్రపంచంలో జీవిస్తాయని చెప్పారు.
కుక్క ఒక నమూనాను వాసన చూసేటప్పుడు వాస్తవంగా ఏం గుర్తిస్తోందో అర్థం చేసుకుని, ఆ సమాచారాన్ని మనకు అర్థమయ్యేలా మార్చేందుకు తమ టెక్నాలజీని రూపొందించినట్లు తెలిపారు.
వివరాలు
కోవిడ్ నుంచి క్యాన్సర్ వరకు:
కుల్గోడ్ కుటుంబంలో వైద్యులు, కుక్కలు రెండూ తన బాల్యంలోనే పరిచయమయ్యాయని చెప్పారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ ఆలోచనకు బీజం పడిందని వివరించారు.
రెండో దశలో ఆసుపత్రిలో తన తండ్రి ఎవరికి చికిత్స అందించాలి, ఎవరికి సాధ్యం కాదు అనే కఠిన నిర్ణయాలు తీసుకోవడం చూశానన్నారు.
అదే సమయంలో లక్షణాలు కనిపించని వారిలోనూ కుక్కలు కోవిడ్‌ను గుర్తించగలవని తెలిపే పరిశోధనలను ఆయన చూశారు.
దీంతో వ్యాధులను గుర్తించే కుక్కలు పెద్ద ఎత్తున ఎందుకు లేవనే ప్రశ్న తనను ఆలోచింపజేసిందని చెప్పారు. అదే ఆలోచన చివరకు డాగ్నోసిస్ ఏర్పాటుకు దారితీసిందన్నారు.
వివరాలు
కోవిడ్ నుంచి క్యాన్సర్ వరకు:
కుల్గోడ్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో కాగ్నిటివ్ సైన్స్, కంప్యూటేషనల్ న్యూరోసైన్స్ చదివారు.
ఆయన హానర్స్ థీసిస్ కుక్కల వాసన గుర్తింపు సామర్థ్యంపై ఉండేది.
అనంతరం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎలైట్ కే9 యూనిట్‌లో పనిచేసిన ఇటమార్ బిటాన్‌తో కలిసి డాగ్నోస్టిక్స్ సంస్థను ప్రారంభించారు.
బిటాన్‌కు వైద్య గుర్తింపులో కుక్కలను ఉపయోగించే సంస్థలో పనిచేసిన అనుభవం కూడా ఉంది.
వివరాలు
మాస్క్,కుక్క.. ఆ తర్వాత ఏఐ:
ఈ విధానంలో మొదటి దశ చాలా సులభంగా ఉంటుంది.
ఒక వ్యక్తి సుమారు 10 నిమిషాల పాటు సాధారణంగా శ్వాస తీసుకుంటూ ప్రత్యేకమైన కాటన్ మాస్క్‌లోకి శ్వాస వదులుతారు.
మధ్య మధ్యలో లోతుగా శ్వాస తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తి శ్వాసలోని రసాయన పదార్థాలను మాస్క్ సేకరిస్తుంది.
అనంతరం ఆ నమూనాను ప్రయోగశాలకు పంపిస్తారు. అక్కడ శిక్షణ పొందిన కుక్కలు దాన్ని వాసన చూస్తాయి.
అయితే నమూనాను వాసన చూసిన తర్వాత కుక్క కూర్చుందా, కదిలిందా, మరేదైనా సంకేతం ఇచ్చిందా అనే విషయాన్ని మాత్రమే సంస్థ పరిగణనలోకి తీసుకోవడం లేదు.
కుక్క నమూనాను పరిశీలిస్తున్న సమయంలో దాని శరీరంలో, ప్రవర్తనలో జరిగే మార్పులను కూడా సాంకేతికత ద్వారా నమోదు చేస్తున్నారు.
వివరాలు
మాస్క్,కుక్క.. ఆ తర్వాత ఏఐ:
కుక్కలకు ప్రత్యేక సూట్ ధరింపజేసి వాటి మెదడు కార్యకలాపాలు, శ్వాస, గుండె స్పందనను పరిశీలిస్తారు.
అదే సమయంలో కెమెరాలతో వాటి శరీర భాషను రికార్డు చేస్తారు.
ఇలా సేకరించిన మెదడు తరంగాల సమాచారం,శ్వాస విధానం, ప్రవర్తనకు సంబంధించిన డేటాను ఏఐ మోడల్‌లోకి పంపిస్తారు.
ఆ డేటా ఆధారంగా VOC రిస్క్ స్కోర్‌ను రూపొందిస్తారు. సాధారణంగా కుక్కలు ఇచ్చే సంకేతాలను ట్రైనర్ అర్థం చేసుకుంటారు.
అయితే జీవ నమూనాలను పరిశీలించే సమయంలో కుక్కలో కనిపించే చిన్నచిన్న మార్పుల్లోనూ చాలా సమాచారం ఉండొచ్చని సంస్థ భావిస్తోంది.
అందుకే కేవలం'ఉంది' లేదా 'లేదు'అనే రెండు సమాధానాలకే పరిమితం కాకుండా, కుక్కల మెదడు, శ్వాస, ప్రవర్తనకు సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా ఏఐతో కలిపి విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు.
వివరాలు
క్యాన్సర్ గుర్తింపే అసలు సవాలు:
డాగ్నోసిస్ తమ విధానాన్ని క్యాన్సర్ నిర్ధారణ పరీక్షగా కాకుండా 'భరోసా కోసం చేసే పరీక్ష'గా చెబుతోంది.
స్కాన్ లేదా రక్త పరీక్ష చేయించుకోకుండా,ఆరోగ్యంపై ముందస్తు సంకేతం తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగపడాలన్నది సంస్థ ఉద్దేశం.
రిస్క్ స్కోర్ తక్కువగా వస్తే ఆందోళన తగ్గించుకోవచ్చని, ఎక్కువగా వస్తే అవసరమైన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తామని సంస్థ తెలిపింది.
2026 ఏప్రిల్‌లో'జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ఈ విధానానికి సంబంధించిన ఫలితాలను వెల్లడించింది.
ఇందులో క్యాన్సర్ ఉన్న వారిని గుర్తించే సెన్సిటివిటీ 90.8శాతంగా నమోదైంది.
అంటే క్యాన్సర్ ఉన్న దాదాపు ప్రతి 10 మందిలో తొమ్మిది మందిని ఈ వ్యవస్థ గుర్తించింది.క్యాన్సర్ లేని వారిని సరిగ్గా గుర్తించే స్పెసిఫిసిటీ 91.3శాతంగా నమోదైంది.
వివరాలు
క్యాన్సర్ గుర్తింపే అసలు సవాలు:
కర్ణాటకలోని ఆరు ఆసుపత్రుల్లో మొత్తం 3,275 మందిని అధ్యయనంలో చేర్చారు. చివరి పరీక్షల కోసం 1,502 మంది డేటాను ఉపయోగించారు.
వీరిలో బయాప్సీ ద్వారా క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన వారు 283 మంది. ఏడు ప్రధాన రకాల క్యాన్సర్లను ఇందులో పరిశీలించారు.
క్యాన్సర్ ఏ దశలో ఉన్నా ఈ విధానం పనితీరులో పెద్దగా తేడా కనిపించలేదని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
వివరాలు
స్క్రీనింగ్ పరీక్ష
క్యాన్సర్ అనుమానం ఉన్నప్పుడు రక్త పరీక్షలు, స్కానింగ్, ఎండోస్కోపీ, బయాప్సీ వంటి వివిధ పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
క్యాన్సర్ రకాన్ని బట్టి పరీక్షలు మారుతాయి. వీటిలో కొన్ని ఖర్చుతో కూడుకున్నవి కాగా, మరికొన్ని శరీరంలోకి పరికరాలను ప్రవేశపెట్టాల్సిన పరీక్షలు.
అందరికీ ఇలాంటి పరీక్షలు చేయడం కూడా ఆచరణలో సాధ్యం కాదు.
అందుకే తక్కువ ఖర్చుతో, శరీరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్ష అందుబాటులోకి వస్తే ఉపయోగకరంగా ఉండొచ్చు.
అయితే అందుకు ముందుగా ఆ పరీక్ష తగినంత కచ్చితత్వంతో పనిచేస్తుందని విస్తృత పరిశోధనల్లో నిరూపించాల్సి ఉంటుంది.
వివరాలు
స్క్రీనింగ్ పరీక్ష
తమ టెక్నాలజీని స్క్రీనింగ్ ప్రక్రియలో తొలి దశగా డాగ్నోసిస్ భావిస్తోంది.
CT స్కాన్,PET స్కాన్, బయాప్సీ లేదా వైద్య నిపుణుల పరీక్షలను భర్తీ చేయడం దీని ఉద్దేశం కాదు.
క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చని భావించే వ్యక్తులను ముందుగానే గుర్తించి,అవసరమైన తదుపరి పరీక్షల కోసం పంపించడమే లక్ష్యం.
భారత్‌లో ఈ విధానానికి ప్రాధాన్యం ఉండొచ్చని సంస్థ భావిస్తోంది.
దేశంలోని అన్ని ప్రాంతాల్లో అధునాతన వైద్య పరీక్షలు అందుబాటులో ఉండకపోవడం,క్యాన్సర్ ఆలస్యంగా గుర్తించడం ఇప్పటికీ పెద్ద సవాళ్లుగా ఉన్నాయి.
ఇప్పటికే ఆసుపత్రులు, స్క్రీనింగ్ క్యాంపుల ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లోనూ నమూనాలు సేకరించినట్లు సంస్థ తెలిపింది.
భవిష్యత్తులో ప్రభుత్వ భాగస్వామ్యంతో మరింత పెద్ద సంఖ్యలో ప్రజలకు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వివరాలు
వైద్యుల ఆమోదం కీలకం
కొత్త వైద్య సాంకేతికతల విషయంలో ప్రారంభంలో అనుమానాలు ఉండటం సహజమే.
కుక్కలు గుర్తించే వాసన సంకేతాలను నమ్మదగిన వైద్య పరీక్షగా మార్చగలమా అనే సందేహాలు వైద్యుల్లో మొదట్లో ఉన్నాయని డాగ్నోసిస్ తెలిపింది.
అయితే ఆధారాలు, పరిశోధన ఫలితాలు పెరుగుతున్న కొద్దీ పరిస్థితి మారుతోందని సంస్థ అభిప్రాయపడుతోంది.
మొత్తంగా చూస్తే.. కుక్కలతో వైద్యులను భర్తీ చేయడం ఈ ప్రయత్నం లక్ష్యం కాదు.
కుక్కలు ఇప్పటికే గుర్తించగలవని భావిస్తున్న సూక్ష్మ సంకేతాలను శాస్త్రీయంగా కొలిచి, వైద్య రంగానికి ఉపయోగపడే సమాచారంగా మార్చడమే ప్రధాన ఉద్దేశం.
క్యాన్సర్ ప్రమాదం ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించగలిగితే, వారికి అవసరమైన స్కానింగ్, బయాప్సీ, ఇతర వైద్య పరీక్షలను త్వరగా చేయించి, సరైన చికిత్స దిశగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.