ఫలితం రాకముందే వరస్ట్ వైఫల్యం గురించి ఆలోచిస్తున్నారా? ఈ జబ్బు నుండి బయటపడే మార్గాలివే
ఏదైనా పనిచేసినపుడో లేదా చేయాలనుకున్నప్పుడో ఆ పనివల్ల జరిగే మంచితో పాటు చెడు కూడా ఆలోచించడం మంచిదే. కానీ చెడులో అత్యంత చెడు ఏం జరుగుతుందోనని ఊహిస్తూ ఉండడం వల్ల చిన్న చిన్న విషయాల్లో కూడా ఎటూ నిర్ణయం తీసుకోలేక సతమతం అవ్వాల్సి వస్తుంది. ఉదాహరణకు ఎగ్జామ్ ఫెయిల్ ఐతే ఏమవుతుందని ఆలోచించడం మొదలెట్టి, జాబ్ రాదని అనుకుంటారు. అక్కడితో ఆగకుండా జాబ్ రాకపోతే సమాజంలో గౌరవం ఉండదని, అందరూ హేళన చేస్తారని ఆలోచిస్తుంటారు. ఇంకా అక్కడితో ఆగకుండా అందరూ తనని వదిలేసినట్టు, ఎగ్జామ్ లో ఫెయిల్ అవడం వల్ల ఒంటరిగా మారినట్టు ఫీలవుతారు. ఈ నెగెటివ్ ఆలోచనల సరళిని కేటాస్ట్రోఫిక్ థింకింగ్ అంటారు. ఇదొక మానసిక జబ్బు.
ఈ జబ్బు నుండి దూరం అవ్వడానికి ఏం చేయాలి
ఏ పనిచేసినా నెగెటివ్ గా ఆలోచించడం మానేయండి. దాని బదులు పాజిటివ్ గా ఆలోచిస్తూ ఎగ్జామ్ పాస్ ఐతే ఏమవుతుందో ఊహించండి. గట్టిగా అరవండి: నెగెటివ్ ఆలోచనల్లో మునిగిపోయి వరస్ట్ కేస్ లో ఏమవుతుందోనన్న ఆలోచనలు మీకు వచ్చినపుడు గట్టిగా స్టాప్ అని అరవండి. అరుపు వల్ల మీ ఆలోచనలు మారిపోతాయి. వ్యాయామం చేయండి: నెగెటివ్ ఆలోచనలు రావడానికి ముఖ్య కారణాల్లో యాంగ్జాయిటీ, అలసట కూడా ఓ కారణం. అందుకే వాటిని దూరం చేసుకునేందుకు రోజూ ఉదయం వ్యాయామం చేయండి. వ్యాయామం వల్ల శరీరంలో సెరెటోనిన్ అనే హ్యాపీ హర్మోన్ ఉత్పత్తి అవుతుంది. సో, నెగెటివ్ ఆలోచనలు మీ దరిచేరకుండా ఉంటాయి. ఫలితంగా మానసిక సమస్య నుండి మీరు బయటపడతారు.