8గంటలు ఆపకుండా స్విమ్మింగ్ చేసి రికార్డ్ సృష్టించిన 15ఏళ్ళ అమ్మాయి
భారతదేశాన్ని గర్వంతో ఊగిపోయేలా చేయడానికి ఊపిరి ఆపుకుని 8గంటలు ఆపకుండా స్విమ్మింగ్ చేసింది చత్తీస్ ఘర్ కు చెందిన పదిహేనేళ్ళ అమ్మాయి. స్విమ్మింగ్ లో అపారమైన ప్రతిభ కనబర్చి, గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తనకంటూ ఓ పేజీ సృష్టించుకుంది 15ఏళ్ళ అమ్మాయి చంద్రకళ ఓజా. చత్తీస్ ఘర్ రాష్ట్రంలోని పురై గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న చంద్రకళ ఓజా, ఆపకుండా 8గంటలు స్విమ్మింగ్ చేసింది. పురై గ్రామంలోని చిన్న కొలనులో ఉదయం 5:10గంటలకు నీటిలోకి దిగిన చంద్రకళా, మద్యాహ్నం 1:10గంటల వరకు ఈత కొడుతూనే ఉంది. దాంతో గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది చంద్రకళ.
జాతీయ స్థాయిలో బంగారు పతకాలు గెలుచుకున్న చంద్రకళ
ఐదేళ్ల వయసులోనే స్విమ్మింగ్ నేర్చుకోవడం మొదలెట్టింది చంద్రకళ. కోచ్ ఓంకార్ ఓజా సాయంతో రోజూ 10-12గంటలు ప్రాక్టీసు చేసేదట. రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న చంద్రకళ, ఇప్పటివరకు 3బంగారు పతకాలు, రెండు రజత పతకాలు సాధించింది. గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కడంతో సంబరంగా ఫీలైన చంద్రకళ, దీనికి కారణం కోచ్ ఓంకార్ ఓజా అని చెప్పుకొచ్చింది. అంతేకాదు, చంద్రకళ సామర్థ్యాన్ని గుర్తించిన ఊరి జనాలు, ఆమెకు వెన్నుదన్నులా నిలిచారు. చంద్రకళ తీసుకునే ఆహారం విషయంలోగానీ, సరైన నిద్ర విషయంలో గానీ ఊరు ఊరంతా సరైన మద్దతునిచ్చారని గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది.